బహుళ పంటలతో పెరగనున్న భూసారం
రాయచోటి టౌన్ : వేరుశనగ పొలంలో బహుళ పంటలు సాగు చేస్తే భూసారం పెరుగుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్ అన్నారు. శుక్రవారం రాయచోటి రూరల్ పరిధిలోని యండపల్లె గ్రామం జంగంరెడ్డిగారిపల్లె సమీపంలో జయమ్మ అనే మహిళ రైతు చేలో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ పంటలో చేలో ఐదు అడుగులకు ఐదు అడుగుల విస్తీర్ణంతో పంట కోత ప్రయోగం చేశారు. అందులో 8.5 కిలోల వేరుశనగ కాయలు పండించినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేరుశనగ పంటలో అంతర (పంటలుగా) బహుళ పంటలను సాగు చేయాలని సూచించారు. ఇలా చేయడం వల్ల అనేక రకాల లాభాలు వస్తాయన్నారు. భూమి ఎల్లప్పుడు కప్పిపెట్టడంతో భూసారం కొట్టుకుపోకుండా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గి దిగుబడి, లాభం పెరుగుతుందన్నారు. వేరుశనగ పంట చేలో అంతర పంటలుగా అలసంద, నువ్వులు, పెసర్లు, కంది, అనప, ఆముదం, మొక్కజొన్న, గోరుచిక్కుడు వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చుని తెలిపారు. అలాగే అంచుపంటగా జొన్న, సజ్జ పంటలను సాగు చేస్తే చీడపీడల నుంచి పంటను సాగు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


