ఆత్మహత్యకు యత్నించిన యువకుడి మృతి
రామసముద్రం : కళాశాలకు సక్రమంగా వెళ్లకుండా ఉన్న బిడ్డను కుటుంబ సభ్యులు మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన రామసముద్రం మండలంలో శుక్రవారం జరిగింది. ఎలకపల్లె పంచాయతీ జక్కంవారిపల్లెకు చెందిన గౌరమ్మ కుమారుడు అభిషేక్(17) రామసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివేవాడు. తండ్రి వెంకటేష్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి అభిషేక్ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో కళాశాలకు కూడా సక్రమంగా పోకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపానికి గురైన యువకుడు ఈనెల 13న విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబీకులు యువకుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అభిషేక్ మృతితో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. కురబలకోటకు చెందిన చెంగయ్య కుమారుడు రామాంజులు(40) కూలి పనులకు వెళ్లి జీవించేవాడు. కుటుంబ సమస్యల కారణంగా భార్యతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటి వద్దే పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


