
పంచముఖ గణపతిం భజేహం
● రాజంపేటలో అరుదైన ఆలయం
రాజంపేట టౌన్ : రాజంపేట మండలం ఇసుకపల్లె రోడ్డులోని రాజీవ్ స్వగృహ ప్రాంతంలో నిర్మితమైన పంచముఖ విష్ణుగణపతి ఆలయం.. అనతికాలంలోనే ఎంతో విశిష్టత సంతరించుకుంది. సాధారణంగా వినాయక స్వామి ఆలయాల్లో వక్రతొండంతో ఉన్న విగ్రహాలను భక్తులు కొలువుదీర్చుతారు. అయితే రాజీవ్ స్వగృహ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభించిన వినాయక స్వామి ఆలయంలో.. పంచముఖ విష్ణుపతిని కొలువుదీర్చారు. చుట్టూ చుట్టుకున్న ఆదిశేషుడిపై.. ఈ గణనాఽథుడు ఆశీనులై ఉండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇదిలా వుంటే ఆదిశేషుడిపై ఆశీనులయ్యే అర్హత ఒక విష్ణువుకు మాత్రమే ఉంటుంది. అయితే అక్కడి పంచముఖ విష్ణుగణపతి ఆలయంలో వినాయకుడు తన అంకం (తొడ)పై లక్ష్మీదేవిని కూర్చోపెట్టుకొని ఆదిశేషుడుపై ఆశీనులు కావడం వల్ల స్వామివారు పంచుముఖ విష్ణుగణపతిగా ప్రసిద్ధి చెందారు. పంచముఖ వినాయక స్వామి ఆలయం దేశంలో తొలుత మహారాష్ట్రాలోని షిర్డీ క్షేత్రంలో వెలసింది. రాజంపేట మండలంలోని రాజీవ్ స్వగృహ ప్రాంతంలో వెలసిన పంచముఖ విష్ణుగణపతి ఆలయం రెండవది కావడం విశేషం.
మూలవిరాట్‌కు మరో ప్రత్యేకత
రాజీవ్ స్వగృహ సమీపంలో వెలసిన పంచముఖ విష్ణుగణపతి ఆలయంలోని మూలవిరాట్‌ను శ్రేష్టమైన కృష్ణశిలతో రూపొందించారు. అలాగే ఆలయంలో ఉన్న నవగ్రహాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఈ నవగ్రహాలు సతీవాహన సమేతంగా కొలువుదీరడం విశేషం. సతీవాహన సమేతంగా కొలువైన నవగ్రహాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేవు. ఈ ఆలయంలో దక్షిణా మూర్తి, పంచముఖ ఆంజనేయ స్వామి, గాయత్రీదేవి, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి దేవదామూర్తులు కూడా కొలువై ఉన్నారు. విగ్రహాలను నిర్వాహకులు మహాబలిపురంలోని శిల్పులతో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆలయాన్ని కూడా మహాబలిపురానికి చెందిన శిల్పులతో నిర్మింప చేయించడం విశేషంగా చెప్పుకోవచ్చు.