
బొజ్జ గణపయ్య పండుగ .. ఉపాధి మెండుగా
● చిరు వ్యాపారులు, వివిధ రంగాల
కార్మికులకు చేతినిండా పని
● 27 నుంచి ప్రారంభం కానున్న గణపయ్య వేడుకలు
రాజంపేట టౌన్ : నాణేనికి ఒకవైపు కాదు రెండువైపులా చూడాలి అంటుంటారు పెద్దలు. అలాగే వినాయచవితి వేడుకలు అంటే భక్తిభావం, సందడైన వాతావరణం అన్న అభిప్రాయమే ప్రజల్లో నాటుకు పోయింది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. హిందువులకు పెద్ద పండుగ సంక్రాంతి. అయితే సంక్రాంతి పెద్ద పండుగ అయినప్పటికి ప్రధానంగా దుస్తులు, నిత్యావసర సరుకుల వ్యాపారులకు ఆదాయాన్ని ఇస్తుంది. అయితే వినాయక చవితి పండుగ చిరువ్యాపారులకు, వివిధ రంగాల కార్మికుల, రైతుల కడుపు నింపుతుంది. వినాయక చవితి ప్రారంభానికి ముందు నుంచే అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. అందువల్ల ఈ ఉత్సవాలపై అనేక మంది ఆశలు పెట్టుకుంటారు. మరో రెండు రోజుల్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చవితి వేడుకల సందడి ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పటి నుంచే వివిధ రంగాల కార్మికులు చవితి ఉత్సవాలకు సంబంధించిన పనులు జోరుగా చేస్తున్నారు.
కళాకారులకు పండగే..
సెల్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక కాలక్షేపానికి, వినోదానికి కొదవలేదనే చెప్పాలి. అందువల్ల అనేక కళలు కూడా అంతరించిపోయాయి. అయితే వినాయక చవితి సందర్భంగా గాన, నృత్య, మిమిక్రి, మ్యాజిక్‌షో, సన్నాయి వాయిద్యం, డ్రమ్స్ వాయించే కళాకారులకు చేతినిండా పని లభించి కనీసం ఓ రెండు నెలల పాటు వారి కుటుంబాల పోషణ సాఫీగా సాగిపోతుంది. జిల్లాలో వందలాది మంది కళాకారులు వివిధ కళలను నమ్ముకొని జీవిస్తున్నారు. వారిలో అనేక మంది కళల ద్వారా వచ్చే ఆదాయంతో జీవించే వారు కూడా లేకపోలేదు. అలాంటి వారికి వినాయక చవితి నిజంగా కడుపునింపే పండుగ అనే చెప్పాలి. కాగా చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు పురోహితులకు కూడా ఉపాధి లభిస్తుంది.
చిరు వ్యాపారులకు, రైతులకు సైతం..
కొన్ని రోజుల పాటైనా ఇబ్బందులు లేకుండా చిరు వ్యాపారులు, రైతుల కడుపునింపేందుకు వినాయక చవితి వేడుకలు ఎంతగానో దోహదపడతాయి. చవితి వేడుకలు జరిగినన్ని రోజులు ప్రధానంగా పూలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. అందువల్ల వ్యాపారులకు, రైతులకు కొంతమేర ఆదాయం సమకూరి వారి కుటుంబ పోషణకు దోహదపడనుంది.
కార్మికులకు ఉపాధి..
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అసంఘటిత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇందులో ఎలక్ట్రీషియన్, దినసరి కూలీలు, ట్రాక్టర్ డైవర్లకు చేతినిండా పని దొరుకుతుంది. ఇందువల్ల చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు అసంఘటిత కార్మికుల్లో కొంత మందికి మెండుగా ఉపాధి దొరుకుతుంది.

బొజ్జ గణపయ్య పండుగ .. ఉపాధి మెండుగా