
మండలాల వారీగా ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు
మదనపల్లె: మేం అధికారంలోకి వస్తే..పేదలు ఇళ్లు నిర్మించుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీగా ప్రకటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. కోటలు దాటిన మాటలేమో అక్కడే ఉండిపోయాయి. పేదలేమో ఇళ్ల మంజూరు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల కోసం స్థలాలు, పక్కా గృహాల మంజూరుపై ఇంతవరకు పట్టించుకోలేదు, కనీసం సమీక్ష కూడా జరగలేదు. దీంతో జిల్లాకు చెందిన పేదలు తమకు స్థలాలు ఎప్పుడిస్తారు, పక్కా ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారని ఎదురుచూస్తున్నారు.
మేమొస్తే అని చెప్పి..
మేమొస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని నోటికొచ్చిన హామీలు, మరోవైపు సూపర్ సిక్స్ ఊకదంపుడుతో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు ఇప్పుడు వాటి అమలుపై తీరికలేకపోయింది. హామీల అమలు కోసం కళ్లు కాయలు కాస్తాయా అన్నంతగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పేదలు ఇళ్ల స్థలాలు, అందులోనూ ఇళ్ల నిర్మాణాల కోసం రూ.4 లక్షల ఆర్థిక సహయం అందించే పథకం కోసం ఆశలు పెట్టుకున్నారు. ఏడాది దాటినా ప్రభుత్వం ఇంతవరకు పేదలకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు 78,221 పక్కా గృహాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. 2024 జూన్ 3 నాటికి 34,906 గృహ నిర్మాణాలను పూర్తి చేయించగా, లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించింది. దీనికోసం బిల్లులు, మెటిరియల్, సిమెంట్ కలిపి రూ.826 కోట్లు ఖర్చు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదు. పైసా ఖర్చు చేయలేదు.
జిల్లాలో 45,079 దరఖాస్తులు
కొత్తగా ఇళ్ల మంజూరు కోసం గృహ నిర్మాణశాఖ జిల్లాలో పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఏడాదిగా స్వీకరిస్తున్న ఈ దరఖాస్తుల్లో ఇప్పటిదాకా 45,079 అందాయి. ఇందులో జిల్లాలోని 30 మండలాల నుంచి 41,688, నాలుగు పట్టణ ప్రాంతాల నుంచి 3,391 దరఖాస్తులు అందాయి. వీటిపై నివేదికలు సిద్ధం చేశారుకాని ప్రభుత్వం నుంచి మంజూరుకు ఆదేశాలు లేకపోవడంతో నివేదికలు అలాగే మురిగిపోతున్నాయి. పూర్తిస్థాయిలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తే వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తుండగా ఆదేశాలు అందగానే డీపీఆర్‌లను తయారు చేసేందుకు ఉపక్రమించనున్నారు. డీపీఆర్ పంపాక వాటికి అనుమతులు వచ్చి నిర్మాణాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.
కేంద్రం నిధులతోనే...
కొత్తగా పేదల నుంచి అందిన దరఖాస్తులకు కేంద్రమే పక్కా ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ఒక్కపైసా కూడా భారం మోసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో పేదల ఇళ్ల నిర్మాణాలను పీఎంఏవై కింద మంజూరు చేయించుకుని, కేంద్ర నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేయించేలా ప్రభుత్వం చూస్తోంది. దీనివల్ల నిధులన్నీ కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రప్రభుత్వం నుంచి పైసా నిధులు ఇచ్చే అవకాశం లేకుండా చూసుకుంటోంది.
నివేదిక సిద్ధం
జిల్లాలో కొత్తగా పేదలకు పక్కా ఇళ్ల మంజూరు కోసం నివేదికలు సిద్ధం చేశాం. అర్హులైన పేదల నుంచి పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలైన మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని పేదల నుంచి అందిన దరఖాస్తులను సిద్ధం చేసి ఉంచాం. ప్రభుత్వ ఆదేశాలు అందగానే వాటిని మంజూరు కోసం నివేదిస్తాం. –రమేష్‌రెడ్డి,
ఇన్‌చార్జ్ పీడీ, రాయచోటి
:
:
:
:
:
:
:
:
:
:
చిన్నమండ్యం 2,225
గాలివీడు 3,007
కేవిపల్లె 1,087
కలకడ 1,547
పీలేరు 4,133
రామాపురం 964
రాయచోటీ 599
సంబేపల్లె 1,195
చిట్వేలి 917
కోడూర్ 1,064
నందలూర్ 327
ఓబులవారిపల్లె 1,092
పెనగలూర్ 1,103
పుల్లంపేట 816
రాజంపేట 1,070
టి.సుండుపల్లె 2,130
వీరబల్లి 878
బి.కొత్తకోట 1,339
కలికిరి 1,519
కురబలకోట 1,613
మదనపల్లె 1,741
ములకలచెరువు 1,394
నిమ్మనపల్లె 826
పెద్దతిప్పసముద్రం 1,247
పెద్దమండ్యం 816
రామసముద్రం 1,082
రాయచోటి (పట్టణం) 1,372
రాజంపేట (పట్టణం) 422
బి.కొత్తకోట (పట్టణం) 628
మదనపల్లె (పట్టణం) 969