
పశ్చిమ బెంగాల్ వాసి అనుమానాస్పద మృతి
మదనపల్లె రూరల్ : పశ్చిమ బెంగాల్‌వాసి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం గ్రామ సచివాలయం సమీపంలోని అంగళ్లు రైల్వే అండర్ బ్రిడ్జిపైన, ట్రాక్‌కు పక్కగా గుర్తు తెలియని మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, ఘటన జరిగిన ప్రాంతం రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని వెళ్లిపోయారు. దీంతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీ గదికి తరలించారు. మృతదేహంపై గాయాలు ఉండటం, మృతుడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉండటం, మృతదేహం విసిరిపడేసినట్లుగా ఉండటంతో స్థానికులు ఎవరో హత్యచేసి రైల్వే ట్రాక్‌పై పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సీటీఎం రైల్వేట్రాక్ వద్ద హత్యకు గురయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మృతుడి ఫోటో చూసి గుర్తుపట్టిన పట్టణానికి చెందిన కాంట్రాక్టర్, జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతుడి వివరాలను తెలియజేశారు. మృతుడు పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్‌కు చెందిన ముజమ్మిల్ కుమారుడు ఖదీర్(30)గా తెలిపాడు. కొన్నేళ్లుగా ఉపాధిలో భాగంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుంటాడన్నాడు. కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని, మరో ఇద్దరితో కలిసి ఉంటూ స్థానికంగా రోడ్డు పనులకు వెళ్లేవాడన్నారు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం షెడ్ నుంచి వెళ్లిన ఖదీర్ తిరిగి రాలేదు. సెల్ స్విచ్ ఆఫ్ కావడంతో, అతడితో పాటు ఉంటున్న ఇద్దరు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శనివారం అనుమానాస్పద స్థితిలో ఖదీర్ శవమై కనిపించాడు. కదిరి రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖదీర్ మృతికి గల కారణాలు విచారణలో తేలాల్సి ఉంది.