చమర్తికి రాజంపేటలో ఏం పని?
అధిష్టానవైఖరిపై మోకాళ్లపై నిరసన
రాజంపేట: తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజుకు ఇక్కడ ఏం పని అని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం పద్మప్రియ కల్యాణమండపంలో వారు భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుకు రాజంపేట ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని కోరారు. గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా పార్టీకి అండగా నిలిచారన్నారు. ఆయనకు ఇన్‌చార్జి ఇస్తే అసలుసిసలైన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజంపేటకు సంబంధంలేని వ్యక్తికి ఇన్‌చార్జి ఇస్తే పార్టీ క్యాడర్‌కు అన్యాయం జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులు ఎవరన్నది అధిష్టానం గుర్తించి, నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.కార్యకర్తలను పలుకరించని వారికి ఇన్‌చార్జి ఇస్తే క్యాడర్ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని వాపోయారు. అనంతరం రాజంపేట ఇన్‌చార్జి పదవి బత్యాలకు ఇవ్వాలని కోరుతూ మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లను వేడుకుంటున్నామన్నారు. ఇదిలా ఉంటే.. బలిజ సామాజికవర్గానికి చెందిన నేతలందరూ బత్యాల కోసం ఏకమవుతూ, ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.


