పాఠశాల ప్రహరీ కూలి ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు
మదనపల్లె : పాఠశాల ప్రహరీ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన సంఘటన మదనపల్లెలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు.. పట్టణంలోని కోటబడి హైస్కూల్ పక్కనే ఉన్న ఇంటి గోడ ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా కూలడంతో, ఆ గోడకు ఆనుకుని ఉన్న పాఠశాల ప్రహరీ సైతం కూలింది. పక్కనే ఆడుకుంటున్న త్యాగరాజు వీధికి చెందిన విద్యార్థులు హేమ వరుణ్(12) చారుకేష్ (11)వేదాంత్(04) స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాఠశాలకు చేరుకుని కూలిన గోడను పరిశీలించారు. వేసవి సెలవులు కావడంతో పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేరు. ప్రమాద సమయంలో నీటి డ్రమ్ము గోడ పక్కన ఉండడం వల్ల ఆడుకుంటున్న విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.


