మార్కెట్ కమిటీ పదవి కోసం మల్లగుల్లాలు
రాజంపేట : రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్టీలకు కేటాయించడంతో, ఆ రిజ్వరేషన్ మార్పుకోసం టీడీపీ ప్రయత్నాలు చేసినట్లుగా కూటమి వర్గాల్లో విస్తృత ప్రచారం నెలకొంది. ఎస్టీలకు మార్కెట్ కుర్చీ దక్కకూడదనే టీడీపీ కమ్మ నేతలు మోకాలడుతున్నారు. రాజంపేట, నందలూరు, పెనగలూరు మండల్లాలో ప్రొటోకాల్ కలిగిన స్థానికంగా ఏకై క పోస్టు రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ. తొలిసారిగా మార్కెట్ కమిటీ నియామకాల్లో దళితవర్గానికి (ఎస్టీ)కి రావడంతో ఆ పోస్టును బీజేపీ ఆశిస్తోంది. అయితే ఆశించిన బీజేపీ ఎస్టీనేత మస్తానయ్య ఇటీవల ఆకస్మిక మరణం చెందారు.
స్నేహితుడు పోయాడు..
రాష్ట్ర మంత్రి సత్యకుమార్ తన స్నేహితుడు పోతురాజు మస్తానయ్యకు రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు వచ్చేందుకు ప్రయత్నించారు. తనకు అవకాశం కల్పించాలని మంత్రి సత్యను మృతిచెందిన మస్తానయ్య స్వయంగా కలిసి కోరారు. దీంతో ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళదాం, ప్రయత్నం చేద్దామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ మిత్రుడు మరణించిన నేపథ్యంలో ఆ స్థాయిలో ఎస్టీ నేత బీజేపీలో లేకపోవడ గమనార్హం.
చైర్మన్, వైస్‌చైర్మన్ మాకే కావాలంటున్న టీడీపీ
మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ తమకే కావాలని టీడీపీ నేతలు ఊవ్విళ్లూరుతున్నారు. కూటమిలో నామినేటెడ్ పదవుల కేటాయింపులో తమకే అగ్రపీఠమనే భావనలో తమ్ముళ్లు ఉన్నారు. వర్గనేతలు సుగవాసి సుబ్రమణ్యం, చమర్తి జగన్‌మోహన్‌రాజు వర్గాలు మార్కెట్ కమిటీకి పోటీపడుతున్నారు. అధిష్టానానికి పలువురు కమ్మ సామాజికవర్గ నేతలు పేర్లు వెళ్లాయి. వీరి మధ్య పోటీ నెలకొనడంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. చైర్మన్‌కు రిజర్వేషన్ మార్చని క్రమంలో వైస్ చైర్మన్ పోస్టును కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
వైస్‌చైర్మన్‌పై బలిజ నేతల కన్ను
తమ వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న భావనలో ఉన్న జనసేన నాయకుల్లో నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా తమకు రాలేదనే ఆవేదనలో ఉన్నారు. అధికంగా ఈ పార్టీ బలిజ సామాజికవర్గం నుంచి పదవిని ఆశిస్తున్నారు. ఆ పార్టీ రాజంపేట నియోజకవర్గానికి ముఖ్యనేత, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు యల్లటూరు శ్రీనివాసరాజు వైస్‌చైర్మన్ పదవిని జనసేన పార్టీ కోసం పనిచేసిన నేతకు ఇప్పించాలనే అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే రైల్వేకోడూరులో చైర్మన్ పదవి జనసేనకు ఇవ్వడంతో, రాజంపేటలో వైస్‌చైర్మన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ కమిటీ నియమాకం విషయంలో కూటమిలో మల్లగుల్లాలు పడుతుండటంతో అధిష్టానం నియామకం నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎస్టీకి చైర్మన్ పదవిపై పెదవి విరుపు
రిజర్వేషన్ మార్పునకు టీడీపీ యత్నం
చైర్మన్ పదవి కోసం పలువురు పోటీ


