పీలేరులో ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
పీలేరు: నూతనంగా ఏర్పడ్డ పీలేరు రెవెన్యూ డివిజన్‌లో బుధవారం ఆర్డీవో కార్యాలయం ప్రారంభించారు. స్థానిక మదనపల్లె మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద మహిళా వసతి గృహ భవనంలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆర్డీవో శ్రీనివాస్ రిబ్బన్ కట్‌చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆర్డీవోను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో పలు డివిజన్ స్థాయి సమస్యలు స్థానికంగా పరిష్కరించుకునే సౌలభ్యం ఏర్పడిందని తెలిపారు. భవిష్యత్తులో పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను కూడా పీలేరు రెవెన్యూ డివిజన్‌లో కలపడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివకుమార్, ఎంపీడీవో జి. శివశంకర్, ఏఎంసీ చైర్మన్ పురం రామమూర్తి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


