తండ్రీకొడుకులకు పాము కాటు
మదనపల్లె రూరల్ : తండ్రీ కొడుకులు పాముకాటుకు గురై తండ్రి పరిస్థితి విషమించి మృతి చెందిన ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగు చూసింది. చౌడేపల్లె మండలం బోయకొండ యానాదిపాలెంకు చెందిన నరసింహులు(65), అతని కుమారుడు రాజు(35) మదనపల్లె మండలంలోని మేడిపల్లెలో నివాసం ఉంటున్నారు. రాజు భార్య యశోద పదేళ్ల క్రితమే భర్తను వదలి పిల్లలతో కలిసి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజు తండ్రి నరసింహులు, తల్లి సాలమ్మతో కలిసి కూలిపనులకు వెళుతుండేవాడు. కొంతకాలంగా వేంపల్లె పంచాయతీ బెంగళూరురోడ్డులోని ఓ మామిడితోపునకు తండ్రీ కొడుకులు కాపలాగా ఉంటున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి సమీపంలో ఉన్న చెరువు కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో పాము కాటుకు గురయ్యారు. అయితే, తమకు ఏమీ కాదని నిర్లక్ష్యంగా ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న యజమాని బుధవారం ఉదయం వారిద్దరిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి నరసింహులు పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుమారుడు రాజు ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నాడు.
పరిస్థితి విషమించి తండ్రి మృతి
మృతి చెందిన నరసింహులు, చికిత్స పొందుతున్న రాజు
తండ్రీకొడుకులకు పాము కాటు


