కవరు కట్టు.. లాభాలు పట్టు
రాయచోటి జగదాంబసెంటర్: పండ్లలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం, తద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పండ్ల తోటలు విస్తృతంగా సాగవుతున్నాయి. వీటిలో చెక్కగుజ్జుతో తయారైన పేపరు సంచులను వినియోగించడం ద్వారా నాణ్యమైన ఫలసాయం పొందే వీలుంది. పేపరు సంచులను కాయలకు గాలి చొరబడకుండా కడితే వంద శాతం నాణ్యతను పెంపొందించుకున్నట్లే. అన్నమయ్య జిల్లాలో మామిడి తోటలు దాదాపు 33 వేల హెక్టార్లలో సాగు కాగా.. వీటిలో దిగుబడి 30 నుంచి 40 శాతం మాత్రమే వచ్చాయి. ప్రస్త్తుం మామిడి చెట్లు కాయలతో ఉన్నాయి. ఈ పేపరు సంచుల ద్వారా పండించిన పండ్లు విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో ఉంటాయని చెబుతున్నారు. గతేడాది అనేక మంది రైతులు ఫ్రూట్ కవర్లు వినియోగించి మామిడిలో నాణ్యత పెంచుకొని అధిక ధరలు పొందటం విశేషం.
అధిక ఉష్ణోగ్రతలతో రాలిన పూత, పిందె
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు మామిడిపై తీవ్ర దుష్ప్రభావం చూపాయి. మొదట్లో పూత, పిందె బాగున్నా.. అధిక ఉష్ణోగ్రతలు మామిడి రైతుల ఆశలను రాల్చేశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల రైతుల కళ్ల ముందే 60–70 శాతం పూత, పిందె రాలిపోయాయి. ఈ పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులను కాపాడుకోవడంతోపాటు నాణ్యను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం ఫ్రూట్ కవర్ల వినియోగం ఊరటనిచ్చింది.
కాయలు తాజాగా ఉంటాయి
మామిడికాయలకు కవర్లు తొడగడం వల్ల తాజాగా ఉంటాయి. దానికితోడు ఎటువంటి రోగాలు కూడా దరి చేరవు. నాకు గల 5 ఎకరాల మామిడి తోటలో కొన్ని చోట్ల ఫ్రూట్ కవర్లను తొడిగాను. ఈ సారి అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత, పిందె రాలిపోయాయి. దీంతో అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులను కాపాడుకోవడానికి ఫ్రూట్ కవర్లు తోడ్పడుతాయనే ఆశ ఉంది.
– మండ్ల శివశ్రీనివాసులు, మామిడి రైతు, రాయచోటి మండలం
గిరాకీ బాగుంటుంది
మామిడి కాయలకు ఫ్రూట్ కవర్లు వేయడం వల్ల.. ఎటువంటి రోగాలు దరిచేరవు. ఇలాంటి పండ్లకు మార్కెట్లో అధిక ధరలు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు నేరుగా తోటల వద్దకు వచ్చి మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దానికితోడు ఇలాంటి పండ్లకు ధరలు కూడా బాగుంటాయని ఆశిస్తున్నా. – ఎం.వీరపవన్‌మహేష్,
రైతు, కుర్నూతల, లక్కిరెడ్డిపల్లె మండలం
చీడపీడలు దరి చేరవు
ఫ్రూట్ కవర్లను మామిడి సహా వివిధ పండ్ల సాగులో వినియోగించవచ్చు. వీటి వల్ల వంద శాతం నాణ్యత ఉంటుంది. గాలి చొరబడకుండా కడితే ఎలాంటి చీడపీడలు లేని ఆరోగ్యవంతమైన కాయలు పండించుకోవచ్చు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో నాణ్యత ఉంటుంది. మామిడి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ తదితరాలకు ఎంతో ఉపయోగం.
– వనితాబాయి, ఉద్యాన శాఖ అధికారిణి, రాయచోటి
పెరుగుతున్న ఫ్రూట్ కవర్ల వినియోగం
వంద శాతం నాణ్యత పెంచేందుకు అవకాశం
మామిడి, దానిమ్మ, జామ,డ్రాగన్‌ఫ్రూట్స్‌కు అనుకూలం
కవరు కట్టు.. లాభాలు పట్టు
కవరు కట్టు.. లాభాలు పట్టు
కవరు కట్టు.. లాభాలు పట్టు


