పెద్దతిప్పసముద్రం : పుట్టిన రోజే ఆ యువకుడికి ఆఖరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు. యువకుడితో పాటు అతని స్నేహితుడు సైతం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరిన ఇద్దరు యువకులను మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఓ యువకుడు చనిపోగా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో స్థానిక అంబేడ్కర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన సాదిలి చందూకుమార్ (20) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇదే కాలనీకి చెందిన దండు శీనూ (21) ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం దండు శీనూ జన్మదినం కావడంతో వీరిద్దరూ పుట్టిన రోజు వేడుక సందర్భంగా బి.కొత్తకోటలో సెకండ్ షో సినిమా చూసేందుకు సోమవారం రాత్రి పీటీఎం నుంచి ద్విచక్ర వాహనంలో బయలు దేరారు. సినిమా చూసిన అనంతరం 12 గంటల తరువాత ద్విచక్ర వాహనంలో పీటీఎంకు వస్తున్నారు. ఈ క్రమంలో బి.కొత్తకోట రోడ్డులోని ఓ కోళ్ల ఫారం సమీపంలో గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో దండు శీనూ అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మరో యువకుడు సాదిలి చందూను మదనల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలిస్తుండగా పీలేరు సమీపంలో మృతి చెందాడు. అయితే ఘటన స్థలం వద్ద ఓ అడవి పిల్లి మృతి చెంది ఉండటాన్ని బట్టి చూస్తే పిల్లిని తప్పించి వాహనాన్ని పక్కకు తిప్పి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనం యువకులను ఢీకొందా.. వెనుక నుంచి వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ హరిహర ప్రసాద్ మంగళవారం మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకువి.. కాటికి కాళ్లు చాపే వయసులో మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటావనుకుంటే ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయావా నాయనా.. అంటూ సాదిలి చందూ తల్లిదండ్రులు విలపిస్తుంటే చూపరులు సైతం కంట తడి పెట్టారు. కాలనీలో ఇద్దరు యువకుల అకాల మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు యువకులను బలిగొన్న
రోడ్డు ప్రమాదం
పీటీఎం అంబేడ్కర్ కాలనీలో
విషాద ఛాయలు
పుట్టిన రోజే.. ఆఖరి రోజు !