శుభ్రతలో కొత్త ఒరబడి | Sakshi
Sakshi News home page

శుభ్రతలో కొత్త ఒరబడి

Published Fri, Nov 17 2023 1:34 AM

మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న ఆయా  - Sakshi

మదనపల్లె సిటీ: ప్రభుత్వ బడుల్లో స్వచ్ఛత మెరుగైంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా బడి శుభ్రంగా దర్శనమిస్తోంది. ప్రభుత్వ విప్లవాత్మక మార్పులతో విద్యా ప్రమాణాలు పెరగడంతో పాటు మౌళిక వసతులు మధ్య విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వసతుల కల్పనలో టాయిలెట్ల నిర్వహణపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నేడు క్లీన్‌గా ..నీటుగా దర్శనమిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

● జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 2,213 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1,54,789 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలల పరిసరాల పరిశుభ్రతతో పాటు మరుగుదొడ్లును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేందుకు 300 మంది విద్యార్థుల వరకు ఒకరు, 301 నుంచి 600 విద్యార్థులుంటే ఇద్దరు, 601 నుంచి 900 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు, 900 మంది విద్యార్థులకు పైగా ఉంటే నలుగురు ఆయాలను నియమించారు. ఈ విధంగా జిల్లాలో 2,270 మంది ఆయాలను నియమించారు. వీరికి నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం అందజేస్తున్నారు. ఉదయం పాఠశాలకు విద్యార్థులు వచ్చేసరికి ఆయాలు టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ చొరవను విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు.

● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు బాత్‌రూమ్‌ క్లీనర్‌ ద్రావణం, ఎయిర్‌ ప్రెష్నర్‌ ద్రావణాన్ని ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేసింది. దీంతో పాటు పాఠశాలలకు అవసరమైన బాత్‌రూం బకెట్లు, జగ్గులు, చెత్త సేకరణకు అనువైన బక్కెట్లు, స్ప్రే బాటిళ్లు, బ్రెస్‌లు, ఆయాలకు సేఫ్టీ జాకెట్లు, గౌస్‌లు అందించారు. పాఠశాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉంచడంతో బడి ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉంటే నీళ్లుండేవి కావు. నీళ్లు ఉంటే తలుపులుండవు. రెండూ ఉన్నా నిర్వహణ లేక కంపు కొడుతుండటంతో వెళ్లలేని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో చెట్ల పొదలు, గోడల చాటే గతి. పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో చదువుకు స్వస్తి పలికిన బాలికలు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ అరకొర ఆయాలను నియమించినా ఏడాదికోసారి వేతనాలు ఇస్తుండటంతో పాటు శుభ్రతకు ఎలాంటి సామాగ్రి, రసాయనాలు ఇవ్వకపోడంతో పెద్ద ఫలితం ఉండేది కాదు.

సౌకర్యాల నడుమ పేద విద్యార్థులు చదువులు కొనసాగించాలనే లక్ష్యంలో సీఎం వై.ఎస్‌.జగన్‌ చేపట్టిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ విద్యా సంస్థలను తలపిస్తున్నాయి. శుభ్రమైన ఆధునిక టాయిలెట్లు కార్పొరేట్‌ కార్యాలయంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. పాఠశాల పరిసరాలతో పాటు తరగతి గదులను, టాయిలెట్‌లను నిత్యం శుభ్రంగా ఉంచేందుకు ఒక్కో పాఠశాలకు ఒకరి నుంచి నలుగురు ఆయాలను నియమించారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. దీంతో పాఠశాలల్లో డ్రాపౌట్స్‌శాతం తగ్గతూ వస్తోంది.

నాడు ఇబ్బందులు

నేడు సౌకర్యాలు

ప్రభుత్వ పాఠశాలల్లో పక్కాగా టాయిలెట్ల నిర్వహణ

క్రమం తప్పకుండా క్లీనింగ్‌ సామగ్రి సరఫరా

జిల్లాలో 2,270 మంది ఆయాల సేవలు

Advertisement
Advertisement