17న జిల్లా నిఘా కమిటీ సమావేశం | Sakshi
Sakshi News home page

17న జిల్లా నిఘా కమిటీ సమావేశం

Published Fri, Nov 17 2023 1:34 AM

-

రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటిలో ఈనెల 17న కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అధ్యక్షతన జిల్లా నిఘా, పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జాకీర్‌ హుస్సేన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుందని, జిల్లాలోని నిఘా, పర్యవేక్షక కమిటీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని పేర్కొన్నారు.

17 నుంచి అంతర్‌

జిల్లాల కబడ్డీ పోటీలు

రాయచోటి టౌన్‌: చిట్వేలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఈ పోటీలకు హాజరుకావాలని కలెక్టర్‌ గిరీషా పీఎస్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన్ను కలిశారు. పీఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ జక్రియా బాషా, చిట్వేలి జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తంరెడ్డి, పీఎస్‌టీయూ నాయకులు ఎస్‌ఎండీ గౌస్‌, హబీబుర్‌ రహిమాన్‌ ఆహ్వానపత్రిక అందజేసినవారిలో ఉన్నారు.

15 నుంచి వారోత్సవాలు

రాయచోటి అర్బన్‌: ఈనెల 15వతేది నుంచి 21వ తేది వరకు జరగనున్న జాతీయ నవజాత శిశువారోత్సవాలను విజయవంతం చేద్దామని జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండయ్య, జిల్లావ్యాధి నిరోధక టీకాల అధికారిణి ఉషశ్రీ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.2000వ సంవత్సరం నుంచి ప్రతియేడాది నవంబరు 15 నుండి 21 వతేది వరకు నవ జాత శిశువారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. నవజాత శిశువు జీవిత కాలాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా తల్లులు,కుటుంబ సభ్యులను చైతన్యవంతులను చేయడమే కార్యక్రమం ముఖ్య లక్షణమన్నారు. సచివాలయాల పరిధిలోని నవజాత శిశువుల ఇళ్లను ఆశాకార్యకర్తలు, ఆరోగ్యమిత్రలు, సమాజ ఆరోగ్య అధికారులు విధిగా సందర్శించాల్సి ఉంటుందన్నారు. తమ పరిధిలోని నవజాత శిశువుల జాబితాను తయారు చేయాలన్నారు. పిల్లల పెంపకం తదితర అంశాలపై పిల్లల తల్లులకు అవగాహన కల్పించాలన్నారు.

సచివాలయం పరిశీలన

చెన్నూరు: కేంద్ర ప్రభుత్వ సెక్రటేరియట్‌ శిక్షణ అధికారుల బృందం సభ్యులు గురువారం మండలంలోని బయన పల్లె గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలించారు.అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. నాడు–నేడు పనులను పరిశీలించారు. సభ్యులు రోహిత్‌, భరత్‌ బ్రిజేష్‌ ,సతీష్‌, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

మెరుస్తున్న పసుపు ధర

కడప అగ్రికల్చర్‌: పసుపు ధర మెరుస్తోంది. గత కొద్ది రోజులుగా క్వింటా రూ. 10 వేలు పైనే పలుకుతోంది. దీంతో అన్నదాతలు అనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కడప మార్కెట్‌ యార్డులో క్వింటా ఫింగర్‌ పసుపు అత్యల్ప ధర 9289 ఉండగా అత్యధికం రూ. 10489 పలికింది. బల్బు రకం అత్యల్ప ధర క్వింటా రూ. 6445, అత్యధిక రూ. 10389 ఽపలికింది.

18న ప్రత్యేక సమావేశం

కడప ఎడ్యుకేషన్‌: సమగ్రశిక్ష 2024–25, 2025–26 వార్షిక ప్రణాళిక తయారీ చేసే విషయంపై ఈనెల 18వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లుగా డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డి, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డిలు తెలిపారు. కడప శంకరాపురం జిల్లా స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ మీటింగ్‌ హాల్‌లో సమావేశం ప్రారంభమవుతందన్నారు.

రైళ్లు దారి మళ్లింపు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: పూణె–కన్యాకుమారి–పుణె (16381/82) మధ్య నడుస్తున్న జయంతి జనతా ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. ఈ రైలు ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు దారి మళ్లించారన్నారు. పాకాల, ధర్మవరం, గుత్తిమీదుగా వెళుతుందన్నారు. ముద్దనూరు–కలమల్ల రైల్వే మార్గంలో రైల్వే కారిడార్‌ పనులు జరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

● మధురై–ఓకా (09519) వారాంతపు రైలును ఈనెల 24వ తేదీ వరకు దారి మళ్లించారన్నారు. రైల్వే కారిడార్‌ పనుల వల్ల కాట్పాడి, పాకాల, ధర్మవరం, గుత్తి మీదుగా నడుస్తుందన్నారు.

● తిరుపతి–రేణిగుంట మార్గంలో రోలింగ్‌ కారిడార్‌ పనులు జరుగుతున్న కారణంగా కడప–అర్కోణం–కడప (06401/402) అర్కోణం ప్యాసింజర్‌ రైలు మరో వారం రోజులపాటు రద్దు చేసినట్లు జనార్దన్‌ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement