బ్లాక్‌ మెయిలింగ్‌: భర్త సంసారానికి పనికిరాడని తెలిసినా కూడా! | Sakshi
Sakshi News home page

సంసారానికి పనికిరాని భర్త.. డబ్బుల కోసం మరో పెళ్లి.. ఫోటోలు మార్పింగ్‌ చేసి..

Published Tue, May 30 2023 12:26 PM

- - Sakshi

దిశ పోలీస్‌స్టేషన్‌లతో కొత్త దశ మొదలైంది. చిన్నారులు, మహిళల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఇవి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కాపురాలను చక్కదిద్దుతున్నాయి.

కడప అర్బన్‌ : సమాజంలో భార్యాభర్తల అన్యోన్యతతో కుటుంబ అభివృద్ధి, తద్వారా పిల్లల శ్రేయస్సు, వారి ద్వారా సమాజాభివృద్ధి సుసాధ్యమవుతుంది. వారి మధ్య కలతలు కాపురంలో చిచ్చు రేపుతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయికి వచ్చిన వారు తాము చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాల ‘బిజీ లైఫ్‌’తో తమ పిల్లల బాగోగులను పట్టించుకునే స్థితిలో వుండరు. దీంతో పిల్లలు శారీరక పెరుగుదల, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ తమ దైనందిన జీవితంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి. తాను జీవితాంతం తోడు నీడగా వుండాల్సిన భార్య, భర్త స్థానాలు ఎలా వుండాలి? అనే విధానాలపై ‘మానసిక పరిపక్వత’ చెందక అవగాహన రాహిత్యంతో ‘సంసార జీవితాల’ను దూరం చేసుకుంటున్నారు.

పూర్వకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వుండేవి. అవ్వా,తాతలు తమ పిల్లలకు, మనువలు, మనువరాళ్లకు మంచి, చెడ్డా, కుటుంబ జీవన విధానం, సమాజంలో మెలిగే పద్ధతులను నేర్పించేవారు. రానురాను ఆ విధానంలో వచ్చిన మార్పులతో చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయి, జీవన విధానాలను నగరజీవితాలుగా మార్చుకుని భర్త,భార్య, పిల్లలుగా మారిపోయి ఆర్థికంగా మెరుగు పడాలనే తాపత్రయంలో పడిపోయారు. కాలక్రమేణ వారి పిల్లల కార్పొరేట్‌ చదువులపై వున్న శ్రద్ధ, వారి క్రమశిక్షణతో జీవితాన్ని సాగించేలా చూడాలనే విధానం సన్నగిల్లిపోయింది. అంతేగాక ఆడ,మగ పిల్లలను చిన్నతనం నుంచే వారికి ఇచ్చే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో పెరిగి పెద్దవాళ్లయిన తరువాత కూడా అదే విధానం అవలంబించడం వల్ల జీవితగమనంలో విభేదాలు తలెత్తుతున్నాయి.

సమస్యల చుట్టూ పరిభ్రమిస్తున్న జీవితాలు
ఆధునిక సాంకేతికతతో ‘సెల్‌ఫోన్‌’ లేకుండా చిన్న పిల్లాడి నుంచి పెద్దల వరకు వుండలేకపోతున్నారు. ‘సెల్‌ఫోన్‌’ దైనందిన జీవితంలో భాగమవడంతోపాటు, వ్యసనంగా మారింది. ‘దిశ’ మహిళా అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌ వారు భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న కలతలకు కారణాలను తెలుసుకుని ‘కౌన్సెలింగ్‌’ అనే బ్రహ్మాస్త్రంతో తొలగించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ విధానం ద్వారా చాలా కేసుల్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు.

18 ఏళ్ల వయసు రాగానే, పూర్తవకముందే కొందరు ఆడపిల్లలు తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా తాను ప్రేమించిన యువకుడే సర్వస్వం అంటూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎంత త్వరగా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, వీరిలో కొందరు అంతే త్వరగా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు.

కొందరు తమ సెల్‌ఫోన్‌ల ద్వారా ఇంటిలో పడకగది నుంచి స్నానాల గదుల వరకు ఒకరిపై మరొకరు నమ్మకం లేక వీడియోలను తీసుకుంటూ వారి సంసారాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు.

విద్యావంతులైన వారే కొందరు ఆడపిల్లలు తమ వైవాహిక జీవితాన్ని ఆరు నెలలకు గానీ, ఏడాది పూర్తవక ముందే భర్త సంసారానికి పనికిరాడని నిర్ణయించుకుంటున్నారు. ‘కౌన్సెలింగ్‌ పీరియడ్‌’ రెండు నెలల కాలం పూర్తవక ముందే ‘కక్షసాధింపు’ ధోరణిలో ప్రవర్తిస్తూ విడిపోతున్నారు.

కడప ‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ ద్వారా అందిస్తున్న సేవలు
కడప దిశ పోలీస్‌స్టేషన్‌కు నేరుగాగానీ, జిల్లా ఎస్పీ నిర్వహించే ‘స్పందన’ ద్వారా వచ్చే భార్యాభర్తల, మహిళల, చిన్నపిల్లల సమస్యలు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను డీఎస్పీ స్థాయి అధికారి దృష్టికి వస్తాయి. ఆయన ఆదేశాల మేరకు మొదట బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రాథమికంగా మనస్పర్థలను తొలగించేందుకు ఇక్కడి సిబ్బంది ప్రయత్నిస్తారు. లేదంటే మొదటి రెండు నెలలు ‘కూలింగ్‌ పీరియడ్‌’లో మూడు లేదా ఐదు కౌన్సెలింగ్‌లను నిర్వహించి వారి మధ్య విభేదాలను తొలగించి సజావుగా కాపురం చేసుకునేలా ప్రయత్నిస్తారు. కలువలేని పరిస్థితుల్లో వారి ఇష్ట ప్రకారం ఎఫ్‌.ఐ.ఆర్‌లను తమ పరిధిలో గానీ, ఆయా పోలీస్‌స్టేషన్‌ల ద్వారా నమోదు చేయిస్తారు. తరువాత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఈ కౌన్సెలింగ్‌లను ప్రతి మంగళవారం, శనివారం నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు భార్యాభర్తలను విడివిడిగా పోలీసు అధికారి, మనస్తత్వశాస్త్ర నిపుణులు, న్యాయవాదులు, ఎన్జీఓ సంఘానికి చెందిన సభ్యుల సమక్షంలో విచారణ చేస్తారు. తరువాత ఇద్దరిని కలిపి విచారణ చేసి విడిపోతే కష్ట,నష్టాలు, కలిసుంటే జీవితాంతం సంసారం సాఫీగా సాగుతుందని ‘పోస్ట్‌ మేరిటల్‌ కౌన్సెలింగ్‌’ విధానం ద్వారా వివరిస్తారు. గతంలో ప్రతి మంగళవారం, శనివారం కౌన్సెలింగ్‌ను ఐదు జంటలలోపు నిర్వహించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 జంటలకు నిర్వహించాల్సి వస్తోంది.

కొందరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ ఆడపిల్లలకు తక్కువ వయసులోనే వివాహం చేస్తుంటారు. వారికి వైవాహిక జీవితంపై అవగాహన వుండదు. అలాంటి జంటలకు కౌన్సెలింగ్‌ ద్వారా వారి మధ్య మనస్పర్థలు తొలగించి, వారిని ఒక్కటిగా చేసి పంపిస్తున్నారు.

ఉద్యోగం వుంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి వుంటుందని కొందరు మహిళలు గానీ, పురుషులుగానీ వివాహేతర సంబంధాలు, రెండో వివాహంపై మొగ్గు చూపుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరిని కౌన్సెలింగ్‌ నిర్వహించడం ద్వారా కలుపుతున్నారు. కొందరు ఎన్ని కౌన్సెలింగ్‌లు నిర్వహించినా అవగాహన రాహిత్యంతో దూరంగానే వుంటున్నారు.

మచ్చుకుకొన్ని..
పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాక తన భర్త సంసారానికి పనికిరాడని తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోనే కుమిలిపోయి నరకం అనుభవించింది. డబ్బుల కోసం తన భర్త మరో వివాహానికి సిద్ధపడితే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వాస్తవాలను విచారణ చేసి వారు విడిపోతేనే మంచిదని భావించారు.

తనను ప్రేమించిన సమయంలో ఫొటోలు తీసుకున్న యువతిని, వేరే వివాహం చేసుకున్న తరువాత ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి న్యూడ్‌ ఫొటోలుగా మార్చి ‘బ్లాక్‌ మెయిలింగ్‌’కు పాల్పడిన ఓ యువకుడిని పిలిపించి, సదరు న్యూడ్‌ ఫొటోలను తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేశారు.

ఓ తొమ్మిదినెలల పసిబాబును, భార్యను మనస్పర్థలతో దూరం చేసుకున్న భర్తను ఒకేఒక్క కౌన్సెలింగ్‌ ద్వారా వారిని కలిపి పంపించారు.

కొందరు భర్తలు మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసలుగా మారి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించడం, అవసరమైతే ‘డీ ఆడిక్షన్‌’ సెంటర్‌లకు పంపించి వారిని కలిపేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు.

కౌన్సెలింగ్‌ ద్వారానే మనస్పర్థలకు చెక్‌
భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తున్నాం. ప్రతి మంగళ, శనివారాలలో ‘కౌన్సెలింగ్‌’ను నిర్వహించి వారి మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి న్యాయం జరిగేలా చూస్తున్నాం. మహిళలు, చిన్నారుల పట్ల జరిగే నేరాల నియంత్రణకు అహర్నిశలు పనిచేస్తున్నాం. ‘దిశ’ యాప్‌ను జిల్లా వ్యాప్తంగా మహిళల చేత డౌన్‌లోడ్‌ చేయించాం. ఆపద సమయాలలో ఆదుకుంటున్నాం. – ఎస్‌.రమాకాంత్‌, కడప ‘దిశ’ డీఎస్పీ

Advertisement
 
Advertisement