● జీవితం రుచి తెలిపే పండగ ఉగాది
● ఆలయాల్లో పంచాగ పఠనానికి ఏర్పాట్లు పూర్తి
మదనపల్లె సిటీ: తెలుగువారి తొలి పండుగ ఉగాది పరాభవనామంతో వచ్చేసింది. కష్టసుఖాల కలయికగా.. మమేకమైన షడ్రుచుల సమ్మేళనంగా పలకరించనుంది. కోటి ఆశలతో.. కొంగొత్త కాంతులతో ప్రతి తెలుగువారింట వాలిపోయింది. ప్రతి ఇంటా విరబూసే తెలుగుదనమే ఉగాది పర్వదినం. వినూత్న ఆలోచనతో జిల్లా వాసుల హృదయాలను సంబరాల్లో ముంచెత్తడానికి గురువారం స్పూర్తిదాయక కార్య క్రమాలు ఉత్సాహంగా సాగనున్నాయి. పండుగల్లోకెల్లా ఉగాదికి ప్రత్యేకత ఉంది. ఏటా చైత్రశుక్ల పాడ్య మి రోజున వచ్చే ఈ పండుగను ప్రతి ఇంట్లో తోరణాలు కట్టి, వేపపూత పచ్చడి చేసి సాదరంగా ఆహ్వానిస్తారు. జీవిత గమనంలో కష్టసుఖాలను ప్రతిబింబించే షడ్రుచుల సమ్మేళనంతో ఈ పండుగ సరదగా సాగిపోతుంది.
కవుల పండుగ
ఉగాదిని కవుల పండుగా చెప్పవచ్చు. పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. జిల్లాలోని మదనపల్లెలో మదనపల్లె రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆలయాల్లో సైతం పంచాగశ్రవణాలు నిర్వహించనున్నారు. ఏడాదిలో జరిగే విశేషాలను పండితులు వివరిస్తారు.
పచ్చడి ఆరోగ్యదాయకం
తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది. ప్రకృతి ద్వారా ఆరోగ్య రహస్యాలను అందించే మహత్తర పరమావధి.తీపి,కారం,ఉప్పు,చేదు,వగరు,పులుపు వంటి షడ్రుచులు ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టకరం. తెలుగు లోగిళ్లల్లో చిందులేసే నవవసంత పరవళ్లు ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకు సుసంపన్నం చేసవి. ఫ్యాషన్ ఒరవడిలో పాత ఆచారాలను మరచిపోకుండా సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించే ఉగాది విశేషాలను ఈ తరం వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.


