పరీక్షలు ముగిసిన వేళ.. | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు ముగిసిన వేళ..

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

బ్యాంక్‌లో ఉద్యోగం సాధించాలి

బీటెక్‌ చేయడమే లక్ష్యం

ఆలోచించి నిర్ణయం తీసుకోండి

మెకానికల్‌ ఇంజనీర్‌ కావాలనుకుంటున్నా

జ్ఞాపకాలు నెమరేసుకున్న విద్యార్థులు..

ఇళ్లకు వెళ్లే సమయంలో

బరువెక్కిన చిట్టి హృదయాలు

ఆ క్షణం.. పరీక్షలు ముగిశాయన్న సంతోషం కంటే తెలియని భావోద్వేగమేదో కదలాడింది..చూస్తుండగానే వారి కంట నీరొలికింది.. మళ్లీ ఎప్పుడు కలుస్తామో..ఏ కళాశాలలో కలిసి చదువుతామో అనే దిగులే వారి ముఖాల్లో తారసపడింది.. బుధవారం ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల మోముల్లో కనిపించిన హావభావాలివి. రెండేళ్లపాటు కలిసి చదువుకున్న తోటివారిని వీడిపోతున్నామనే బాధతో.. రెండేళ్ల జ్ఞాపకాల భారంతో వీడ్కోలు పలికారు..

రాజంపేట టౌన్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రెండేళ్ల పాటు ఒకే కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇకపై అందరు ఒకేచోట కలిసి చదువుకోవడం వీలుపడదు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు పరీక్ష అయిపోయాక కళాశాలలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. బీటెక్‌, ఎంబీబీఎస్‌, డిగ్రీ వంటి చదువుల కోసం వేరు, వేరు కళాశాలల్లో చేరినా తమ స్నేహం ఇలాగే ఉండాలంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. చివరగా బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు పయనమయ్యారు.

భవిష్యత్తుపై స్పష్టతతో విద్యార్థులు

ఒకప్పుడు పరీక్షలు ముగిశాక విద్యార్థులు ఏ ఊరెళ్లాళి, సెలవుల్లో ఎలా సందడి చేయాలని ఆలోచించేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే సమయం వృధా చేసుకోకూడదన్న ఆలోచనా ధృక్పథమే వారిలో స్పష్టంగా కనిపించింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అనేక మంది విద్యార్థులు సెలవులు సద్వినియోగం చేసుకొని తద్వారా ఉన్న త చదువులు చదవాలన్న ఆలోచనా సరళిలో ఉన్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది. ఇంటర్‌ పరీక్షలు రాసి బయటకు వచ్చిన పలువురు విద్యార్థులను ‘సాక్షి’పలకరించగా భవిష్యత్తుపై వారికున్న ఆలోచన స్పష్టమైంది.

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

– జిల్లావ్యాప్తంగా చివరి రోజు

పరీక్షకు 259 మంది గైర్హాజర్‌

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. గత నెల 23 నుంచి ప్రారంభమైన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా చివరిరోజు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్‌–2 పరీక్షకు 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సందడి చేస్తూ ఇళ్లకు పయనమయ్యారు.

నేను డిగ్రీలో చేరుతాను. డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతాను. బ్యాంకులో ఉద్యోగం సాధించాలన్నదే నాకోరిక. అందువల్ల పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే సందర్భంలో బ్యాంకులలో పోస్టులు పడితే బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. ఒకవేళ బ్యాంకులో ఉద్యోగం రాకుంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తా.

– సుస్మిత, రాజంపేట

నేను ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తా. మొదట నాముందున్న లక్ష్యం బీటెక్‌ చేయడం. బీటెక్‌ పూర్తయ్యాక ఎంటెక్‌ చేయాలన్నది నాకోరిక. బట్‌ బీటెక్‌ తరువాత అప్పటి పరిస్థితులను బట్టి నా ఫ్యూచర్‌ ప్లాన్‌ ఉంటుంది. ఏది ఏమైనా లైఫ్‌లో మంచి పొజిషన్‌లో ఉండాలన్నదే నాకోరిక. – ఫుర్ఖాన్‌, నందలూరు

ఇంటర్మీడియట్‌ తరువాత అభ్యసించే విద్య భవిష్యత్తుకు ఎంతో ప్రధానమైనది. రాబోవు ఆరేడేళ్ల తరువాత ఎలాంటి ఉద్యోగాలు మెండుగా లభిస్తాయి, అందుకు తగ్గట్లు ఏ కోర్సులు చేయాలి అన్న విషయాలపై తల్లిదండ్రులు, విద్యావంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.అందువల్ల ఒకటికి పదిమార్లు బాగా ఆలోచించి కోర్సులను ఎంపిక చేసుకోవాలి. – ఆకేపాటి రజనీకాంత్‌రెడ్డి,

రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌, రాజంపేట

మా అమ్మ, నాన్న ఇద్దరు నిత్యం కష్టపడతారు. నేను ఇంటర్మీడియట్‌ పరీక్షలు బాగా రాశాను. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తాను. బీటెక్‌లో మెకానికల్‌ బ్రాంచ్‌ తీసుకొని మెకానికల్‌ ఇంజనీర్‌ కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రులు కష్టపడకుండా చూసుకోవా లన్నదే నా ఆశయం. – బిందు, రాజంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement