అమ్మాయిలను అమ్మేశారు! | Human Trafficking Racket Busted | Sakshi
Sakshi News home page

అమ్మాయిలను అమ్మేశారు!

Mar 20 2026 12:35 AM | Updated on Mar 20 2026 12:35 AM

Human Trafficking Racket Busted

బెజ్జూరు నుంచి ఇద్దరి తరలింపు

మధ్యప్రదేశ్‌లో విక్రయించిన ముఠా  

కౌటాల: అతివలను అంగడి సరుకుగా మార్చేశారు. గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా తరలిస్తూ అమ్మేస్తున్నారు. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలానికి చెందిన ఇద్దరు గిరిజన అమ్మాయిలకు ఓ ముఠా మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి తరలించినట్లు తెలిసింది. పెళ్లి పేరుతో ఒక్కొక్కరిని రూ.2.50 లక్షల చొప్పున ఓ ముఠాకు విక్రయించినట్లు సమాచారం. బాధిత అమ్మాయిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ముఠా గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తోంది. 

ముఠాలోని మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళతోపాటు ఇద్దరు పురుషులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జిల్లా నుంచి ప్రత్యేక పోలీసు బృందం మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లి బాధిత అమ్మాయిలను అక్రమార్కుల చెరనుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడ బాధితులు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

మానవ అక్రమ రవాణాలో సూత్రధారులు, పాత్రధారులను పట్టుకునే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. నేడో రేపో పోలీసులు ముఠా అరెస్టు చూపే అవకాశం ఉంది. కాగా, గతేడాది సైతం ఆసి ఫాబాద్‌కు చెందిన ఓ ముఠా మహబూబాబాద్‌ జిల్లా రేకులతండాకు చెందిన ఓ మహిళతోపాటు ఆసిఫాబాద్‌ మండల పరిధిలోని ఓ యువతిని మధ్యప్రదేశ్‌లో విక్రయించారు.

Advertisement
 
Advertisement
Advertisement