హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం

హనుమంతునిపై ఊరేగుతున్న శ్రీరాముడు   - Sakshi

ప్రియభక్తునిపై విహరించిన పట్టాభిరాముడు

వైభవంగా ముత్యపు పందిరి వాహనం

వాల్మీకిపురం: వాల్మీకిపురం పట్టాభిరామస్వామి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు మంగళవారం సీతాసమేత పట్టాభిరాముడు తన ప్రియభక్తుడైన హనుమంతునిపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఉదయం 10 గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజన సేవ నిర్వహించి, సాయంత్రం ఊంజల మండపంలో ఊంజల్‌ సేవ నయనానందకరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ మునిచెంగల్రాయులు, ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, సిబ్బంది దుశ్యంత్‌, నాగరాజ, సిద్ధారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

స్వామివారికి ఘన స్వాగతం

మంగళవారం రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. హనుమంత వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళలు హనుమంత వాహనంపై విహరిస్తున్న స్వామివారికి నేతి దీపాలతో తిరుమాఢ వీధుల్లో స్వాగతం పలికారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు

బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం 8గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 8గంటలకు సింహ వాహన సేవ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top