సాక్షి,కృష్ణా: కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణాజిల్లాలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
మచిలీపట్నం పోర్టు, రాష్ట్రంలో డీజిల్ , పెట్రోల్ కొరత పై చర్చించాం. దేశంలో ఎక్కడా లేనంత కొరత ఏపీలోనే ఉంది. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరత పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరగా పోర్టులు పూర్తిచేయించేందుకు పోరాటం చేస్తాం. ఎన్నికల నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం చాలా వేగంగా సాగింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు పోర్టులు,ఫిషింగ్ హార్బర్లు పూర్తయిపోతాయి.మే 5 నుంచి 10వ తేదీలోపు మచిలీపట్నం పోర్టును సందర్శిస్తాం
పోర్టు అధికారులను అనుమతి కోరాం.
అనుమతులు రాగానే తేదీని ప్రకటిస్తాం.రెండు లక్షల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తున్నారు. కేవలం పదివేల కోట్లు పోర్టులు,హార్బర్లకు ఖర్చు పెట్టలేరా . వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం పోర్టుల పనులు చేపట్టడం లేదు.రాష్ట్రంలో అన్ని పోర్టులు, హార్బర్లు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.. పోరాటం చేస్తాం’అని హెచ్చరించారు.


