AP: రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు

YSRCP Rajya Sabha Candidates Filed Nominations - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్తాన్‌రావులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.
చదవండి: అంబేడ్కర్‌ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'!

రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తాం..
నామినేషన్ల దాఖలు చేసిన అనంతరం విజయసాయిరెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, బీదా మస్తాన్‌రావు, నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో వినిపిస్తామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ బలం 9కి చేరిందని.. 9 మంది ఎంపీల్లో ఐదుగురు బీసీ వర్గాలకు చెందినవారని పేర్కొన్నారు. ఇది బీసీ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కీలకమన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రారంభమైన నామినేషన్ల ఘట్టం..
ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్‌ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ను జారీచేశారు. దీంతో మంగళవారం నుంచే నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈనెల 31వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటిని జూన్‌ 1న ఉ.11 గంటలకు పరిశీలిస్తారు. జూన్‌ 3వ తేదీ మ.3 గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నలుగురు అభ్యర్థుల కంటే ఎక్కువమంది పోటీలో ఉంటే జూన్‌ 10న ఉ.9 గంటల నుంచి మ.4 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తారు.

నాలుగు స్థానాలూ ఏకగ్రీవం! 
ఇక శాసనసభలో వైఎస్సార్‌సీపీకి 150 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి సాంకేతికంగా కేవలం 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే సగటున 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి అంత బలంలేని నేపథ్యంలో.. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీచేసే అవకాశంలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top