యూరియా.. యుద్ధం! | YSRCP raises concerns in the Legislative Council over the hardships of farmers | Sakshi
Sakshi News home page

యూరియా.. యుద్ధం!

Sep 19 2025 5:48 AM | Updated on Sep 19 2025 5:48 AM

YSRCP raises concerns in the Legislative Council over the hardships of farmers

మీడియాతో మాట్లాడుతున్న మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. చిత్రంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు

సీజన్‌లో అన్నదాతల ఇక్కట్లపై శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళన

ఉదయం సభ ప్రారంభంగానే విపక్షం వాయిదా తీర్మానం

తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన మండలి చైర్మన్‌  

పోడియం చుట్టుముట్టి చర్చ కోసం విపక్షం పట్టు.. కొద్దిసేపు వాయిదా 

ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్న 

ప్రభుత్వమే సిద్ధమన్నాక ఇంకా వాయిదాలెందుకు?: బొత్స 

ఐదేళ్లలో ఎప్పుడైనా ఏ ఒక్క రైతైనా రోడ్డెక్కడం చూశారా? 

అదునులో కాకుండా ఎప్పుడో ఇస్తామంటే ఏం లాభం?: ఉమ్మారెడ్డి 

రాష్ట్రంలో మంచినీళ్లు దొరకవుగానీ.. బెల్టుషాపుల్లేని సందే లేదు..  

స్పిరిట్, రంగునీళ్లతో తయారైన మద్యం అమ్మకాల జోరుగా సాగుతున్నాయి 

అమాయకులు చనిపోతున్నట్లు టీడీపీ అనుకూల మీడియాలోనూ వార్తలు వచ్చాయి 

పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలకు సర్కారు నిర్వాకాలే కారణమని మండిపాటు  

సాక్షి, అమరావతి: యూరియా కోసం రైతన్నల ఇక్కట్లు.. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వరుస విషాదాలు, భక్తుల దుర్మరణాలు.. ప్రజల ప్రాణాలను హరిస్తున్న మద్యం, బెల్టు షాపులపై శాసన మండలి సాక్షిగా కూటమి సర్కారు అసమర్థత, నిర్వాకాలను విపక్ష వైఎస్సార్‌ సీపీ కడిగి పారేసింది. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని కన్నెర్ర చేసింది. రైతుల సమస్యలపై తక్షణమే చర్చించాల్సిందేనని పట్టుబట్టింది. గురువారం మొదలైన మండలి సమావేశాలు తొలిరోజు రైతన్నలు, ప్రజా సమస్యలపై విపక్షం ఎక్కడికక్కడ నిలదీయడంతో వాడిగా సాగాయి. 

ఒకపక్క తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తుల దుర్మరణానికి తానే బాధ్యుడినని సభ సాక్షిగా ఒప్పుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. మరోపక్క బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌­ను ఉద్దేశించి దాడి చేశారంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా మాజీ సీఎం పేరును ప్రస్తావించడం ఏమిటని మండిపడ్డారు. సర్కారు తీరుకు నిరసనగా విపక్షం వాకౌట్‌ చేసింది. మండలి తొలిరోజు పలుమార్లు వాయిదా పడింది.  

పోడియం చుట్టుముట్టి నినాదాలు.. 
రైతన్నలు పొలం పనులు వదిలేసి రోజంతా క్యూలైన్లలో నిలబడినా ఒక్క కట్ట కూడా యూరియా దొరకని దుస్థితిని, ఎరువుల సరఫరాలో సర్కారు దారుణ వైఫల్యాలను శాసన మండలి సాక్షిగా విపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎండగట్టారు. అన్నదాతల ఇక్కట్లపై గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్‌ ప్రకటించడంతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో శానస మండలి దద్ధరిల్లింది.

అదునులో యూరియా ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తామంటే ఏం లాభమని ప్రభుత్వాన్ని నిలదీశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏ ఒక్క రైతైనా రోడ్డెక్కడం చూశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరకడం లేదు కానీ మద్యం దొరకని ప్రాంతమంటూ లేదని మండిపడ్డారు. బెల్టు షాపుల్లేని గ్రామాలే కాదు.. సందులు కూడా లేవని ధ్వజమెత్తారు.  రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం తాగి పెద్దసంఖ్యలో అమాయకులు చనిపోతున్నారని, ఈ విషయం టీడీపీ అనుకూల మీడియాలోనూ వచ్చిoదని గుర్తు చేశారు. వేలం పాటలు పెట్టి మరీ బెల్టు షాపులను కేటాయిస్తున్నారన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ పాలసీ అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి చరిత్రలో తొలిసారి తొక్కిసలాట చోటు చేసుకుని భక్తులు దుర్మరణం చెందడం.. సింహాచలంలో గోడ కూలి భక్తులు ప్రాణాలు కోల్పోవటాన్ని ప్రస్తావిస్తూ ఈ విషాదాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండలిలో వైఎస్సార్‌సీపీ మండిపడింది. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. తిరుపతి ఘటనకు బాధ్యుడిగా బదిలీ చేసిన ఎస్పీనే తిరిగి ఎందుకు నియమించాల్సి వచ్చిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు  
గురువారం ఉదయం శాసన మండలి ప్రారంభం కాగానే.. వైఎస్సార్‌సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, వై.శివరామిరెడ్డి రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ ఇచ్చిన  వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా తమ స్థానాల్లో నిలబడి రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. అయితే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెట్టినట్టు చైర్మన్‌ ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పోడి­యం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

వాయిదా తీర్మానాన్ని తిరస్కరించానని, ఈ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయిద్దామని చైర్మన్‌ సూచించగా రైతులు సమస్యలపై చర్చించాల్సిందేనని విపక్ష సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ‘రాష్ట్రంలో యూరియా ఎటుపోయింది బాబూ...? యూరియా కోసం రైతులు ఎండల్లో క్యూలైన్లల్లో నిలబడాలా..? సిగ్గు సిగ్గు... రైతులను అవమానపరిచిన మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి..’ అని పోడియం ఎదుట ప్లకార్డులతో నినదించారు. 

‘నాడు రైతు సంక్షేమం.. నేడు రైతు సంక్షోభం.. రాజకీయాలతోనే కాలక్షేపం.. పట్టదు రైతన్నల సంక్షేమం.. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోండి.. తక్షణమే గిట్టుబాటు ధరలు కల్పించండి.. పంటలకు ఉచిత బీమా ఏదీ? రైతన్నకు ధీమా ఏది? అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.. ధరల స్థిరీకరణ నిధి ఎక్కడా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఏసీలో నిర్ణయం తీసుకున్నాక చర్చిద్దామని వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించగా, శాంతించని వైఎస్సార్‌సీపీ సభ్యులు చైర్మన్‌ కుర్చీని చుట్టుముట్టి నినాదాలు కొనసాగించారు. దీంతో సభను పది నిమిషాలు వాయిదా  వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు.  

గత ఐదేళ్లలో క్యూలైన్లు ఎప్పుడైనా ఉన్నాయా? 
తిరిగి 10.31 గంటలకు సభ ప్రారంభమయ్యాక కూడా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు నిలబడి యూరియా, రైతుల సమస్యలపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ ఎప్పుడు సమయం కేటాయించినా సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ... ప్రభుత్వమే చర్చకు సిద్ధమని చెప్పినప్పుడు రేపు, ఎల్లుండి అంటూ వాయిదాలు ఎందుకు? తక్షణమే చర్చ ప్రారంభించాలని కోరారు.

‘గత ఐదేళ్లలో ఎక్కడైనా ధర్నాలు జరిగాయా? ఎక్కడైనా క్యూలు ఉన్నాయా? ఎప్పుడైనా యూరియా పంపిణీ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారా?’ అని నిలదీశారు. సీజన్‌లో అదునులో యూరియా సరఫరా చేస్తేనే పంటలకు ఉపయోగమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దీనిపై రేపు చర్చిద్దామని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రతిపాదించడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు శాంతించారు.

బెల్టు షాపుల్లేని సందు లేదు..!
శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానాల పట్ల సభ్యు­లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో కల్తీమద్యం తాగి పెద్దసంఖ్యలో అమాయ­కులు చనిపోతున్నారని, ఈ విషయం మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో కూడా వచి్చందని అధికార పక్షాన్ని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ సభ్యు­డు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మంద బలం ఉందని వాస్తవాలు ఒప్పుకోకుండా ఎదురు­దాడి చేయడం సరి కాదన్నారు. మద్యం దుకాణాల కంటే బెల్టు షాపులే ఎక్కు­వగా ఉన్నాయన్నారు. వేలం పాటలు పెట్టి మరీ కేటాయిస్తున్నారన్నారు. 

తొలిసారి గుర్తించిన బెల్టు షాపులకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారని.. ఇప్పటివరకు ఎన్ని గుర్తించారు? ఎంత పెనాల్టీ విధించారు? అని నిలదీశారు. రాష్ట్రంలో స్పిరిట్, రంగునీళ్లతో తయారు చేసిన మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని చెప్పా­రు. వీటిపై ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమందిని అరెస్ట్‌ చేశారు? అని ప్రశ్నించారు. మండపేట మున్సిపల్‌ కార్యాలయం పక్కనే మద్యం షాపు ఏర్పాటుతో కార్యాలయానికి వచ్చే ప్రజలు, ఉద్యోగులు తీవ్ర భయ భ్రాంతులకు గురవుతున్నారన్నారు.  

ఎక్సైజ్‌ పాలసీ అధ్వానం..  
రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ పాలసీ అధ్వానంగా ఉందని వైఎస్సార్‌సీపీ సభ్యుడు శివరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 43 వేల బెల్ట్‌ షాపులున్నాయని, ప్రతి గ్రామంలో 8–10 వరకు బెల్ట్‌ షాపులున్నాయని చెప్పారు. మద్యానికి బానిసై అనంతపురంలో రాజన్న అనే యువకుడు ఉరేసుకుని చనిపోగా మరో యువకుడు బాషా పూటుగా మద్యం తాగి చనిపోయాడని తెలిపారు. సర్కారు మద్యం విధానం వల్ల చనిపోతున్న వారి కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.  

ఎన్ని షాపులపై చర్యలు తీసుకున్నారు? 
ఇంటెలిజెన్స్‌ విభాగం వద్ద బెల్టుషాపుల సమాచారం ఉందని వైఎస్సార్‌సీపీ సభ్యుడు పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. వారి లెక్కల ప్రకారం ఎన్ని ఉన్నాయి? ఎన్నింటిపై చర్యలపై తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

మద్యం ఆదాయం గణనీయంగా పెరిగింది: మంత్రి రవీంద్ర  
అంతకుముందు ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మద్యాన్ని తాము ఆదాయ వనరుగా చూడడం లేదని, అయినా తమ మద్యం విధానం వల్ల రాష్ట్రానికి ఆదాయం భారీగా పెరిగిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం పూర్తిగా ఆగిపోయిందని, పొరుగు రాష్ట్రాల ప్రజలే ఇక్కడకు వస్తున్నారన్నారు. సరిహద్దు జిల్లాల్లో 50–60 శాతం విక్రయాలు పెరగడమే నిదర్శనమని చెప్పారు. 

ప్రభుత్వ వైఫల్యంతోనే తొక్కిసలాటలో భక్తుల మృతి
తిరుపతిలో తొక్కిసలాటతో పాటు సింహాచలంలో గోడ కూలి భక్తుల దుర్మరణం పాలైన ఘటనలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని శాసనమండలిలో వైఎస్సార్‌ సీపీ ధ్వజమెత్తింది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, వరుదు కళ్యాణి, కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌ అడిగిన ప్రశ్నలపై సభలో చర్చ జరిగింది. ప్రభుత్వం, టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే భక్తులు మృత్యువాత పడ్డారని వైఎస్సార్‌సీపీ సభ్యులు మండిపడ్డారు.

ఈ సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘కొన్ని దుర్ఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అంటే.. ఆ శాఖ మంత్రిగా నేనే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. మంత్రి తన ప్రసంగంలో తిరుపతి ఘటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బాధిత కుటుంబాలను పరామర్శించిన తీరును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ ఘటనలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సమయంలో విపక్ష సభ్యులు నిలుచుని ఆందోళనకు దిగడంతో కొద్ది సేపు సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన అనంతరం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స మాట్లాడుతూ సున్నితమైన అంశంపై ప్రభుత్వం సూటిగా జవాబివ్వకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేయటాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  

ఎన్నడూ చూడని ఘటనలు
రామసుబ్బారెడ్డి,  వరుదు కళ్యాణి, భరత్‌
‘తిరుమల చరిత్రలో ఇంత ఘోరమైన ఘటన ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ఇదేమి చిన్న విషయం కాదు. బాధ్యులపై. కఠిన చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. అదే సమయంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందని, టిక్కెట్‌ జారీ కౌంటర్ల వద్ద తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. 

టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పారని, మరి వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నిం­ంచారు. టీటీడీ దేవస్థానం పాలక మండలిపై చర్యలు తీసుకున్నారా? అని నిలదీశారు. సింహాచలం ఉత్సవాల నిర్వహణకు ఐదుగురు మంత్రులతో కమిటీ నియమించటాన్ని ప్రస్తావిస్తూ ఆ దుర్ఘటన తర్వాత ఎవరినైనా అరెస్ట్‌ చేశారా? అని ప్రశ్నించారు. 

పవిత్ర ఆలయాల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభు­త్వం ఏం చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ భరత్‌ ప్రశ్నించారు. తిరు­పతి ఘటనకు బాధ్యులుగా కొందరు అధికారులను సస్పెండ్‌ చేసినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జవాబిచ్చారు. తిరుపతి ఘటన సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శల పేరుతో దాడి చేశారంటూ మంత్రి వ్యాఖ్యానించడంపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అనంతరం విపక్ష సభ్యుల ఆందోళన నడుమ సభ కొద్దిసేపు వాయిదా పడింది.  

బాధ్యత వహిస్తానంటూనే మాజీ సీఎం పేరు ప్రస్తావనా?
బొత్స సత్యనారాయణ
సభ తిరిగి ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..  ప్రశ్నకు సంబంధం లేని విషయాలను మంత్రి ప్రస్తావించటాన్ని తప్పుబట్టారు. రెండు దుర్ఘటనల్లో ‘11 మంది భక్తులు చనిపోవటానికి తానే బాధ్యత వహిస్తానని మంత్రి ఒప్పుకుంటూనే.. మాజీ సీఎం పేరును చర్చలోకి ఎందుకు తెస్తున్నారని నిలదీశారు. ‘మంత్రి మాట్లాడిన ప్రతీ మాటను పూర్తిగా ఖండిస్తున్నాం. ఘటనకు మంత్రి బాధ్యత వహించాలి. 

ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నాం’ అని ప్రకటించారు. విపక్ష సభ్యుల వాకౌట్‌ అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ అలిపిరి వద్ద శనీశ్వర విగ్రహం విషయంలో మాజీ టీటీడీ చైర్మన్‌ రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. ఘటనపై భూమనపై కేసు నమోదు చేస్తామన్నారు. రెండు రోజుల వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని 10 రోజులు కొనసాగించడంపై పునః సమీక్షిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement