మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి | YSRCP Protest For Mango Farmers: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మామిడికి మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి

Jul 1 2026 5:54 AM | Updated on Jul 1 2026 5:53 AM

YSRCP Protest For Mango Farmers: Andhra pradesh

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు

మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట

భారీ ర్యాలీ చేసిన పార్టీ నేతలు, శ్రేణులు, రైతులు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా 

ధర్నాపై పోలీసుల్ని ప్రయోగించిన బాబు సర్కారు 

వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని లాక్కెళ్లిన పోలీసులు 

రైతుల పక్షాన నిలిస్తే పోలీసులతో దౌర్జన్యం చేశారని మండిపడ్డ పార్టీ శ్రేణులు, రైతులు 

రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని భూమన ప్రకటన 

ఫ్యాక్టరీల దోపిడీకి చంద్రబాబు అండగా ఉన్నారని ధ్వజం

కార్వేటి నగరం/కాణిపాకం: మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ ఎదుట పోరుబాట చేపట్టింది. రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి, ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేశారు. భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ గంగాధర నెల్లూరు, చిత్తూరు, చంద్రగిరి సమన్వయకర్తలు కృపాలక్ష్మి, విజయానందరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి ర్యాలీగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.

గంటన్నర పాటు కదలకుండా రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించడంతో వారు ధర్నా చేస్తున్న నేతలు, రైతులపై పడ్డారు. భూమనను లాక్కెళ్లిపోయి, ఆ తర్వాత విడిచిపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ దౌర్జన్యాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు తీవ్రంగా ఖండించారు. రైతుల పక్షాన నిలిస్తే పోలీసులతో దౌర్జన్యం చేశారని మండిపడ్డారు.  

కిలోకు రూ.15 ఇచ్చేంతవరకు పోరాటం: భూమన 
‘ఇంత తక్కువ ధరలతో బతకలేకపోతున్నాం.. లాభాలు వద్దు, కనీసం పెట్టుబడి వరకైనా కిలో రూ.15 ఇస్తేనే బతుకుతాం’ అంటూ మామిడి రైతులు జ్యూస్‌ ఫ్యాక్టరీల ఎదుట గగ్గోలు పెడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి కనీసం చీమ కుట్టినట్లయినా లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కనీసం మద్దతు ధర ఇవ్వని చంద్రబాబు రైతు ద్రోహి అని చెప్పారు. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఒకే ఒక్క ఉత్తరం రాస్తే, కేంద్ర ప్రభుత్వం గత నెల 25నే మొదటి విడతగా ఆ రాష్ట్రంలో 1.30 లక్షల టన్నుల తోతాపురి మామిడిని కిలో రూ.17.50 చొప్పున కొంటామని ప్రకటించిందన్నారు.

మన రాష్ట్రంలో చంద్రబాబు మామిడి రైతులను కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ఫ్యాక్టరీ యజమానులకు తొత్తుగా మారిన ముఖ్యమంత్రి వారి దోపిడీకి అండగా నిలబడ్డారన్నారు. శాంతియుతంగా పోరాడుతున్న మామిడి రైతులను పోలీసు బలగాలతో నిర్దాక్షిణ్యంగా అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీల కుమ్మక్కుతో దాదాపు 2 లక్షల టన్నుల పంటను రైతులు కనీసం ఫ్యాక్టరీల దగ్గరికి కూడా తేలేకపోవడంతో ఆ పంటంతా తోటల్లోనే రాలిపోయిందన్నారు.

ఎంతో శ్రమకోర్చి ఫ్యాక్టరీల వద్దకు లోడ్లు తెచి్చన రైతులకు వారం రోజులైనా లోపలికి పంపకుండా యజమానులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్టరీల దౌర్జన్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం తట్టుకోలేక మొన్న ఒక రైతు జ్యూస్‌ ఫ్యాక్టరీ ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.  రైతులకు కనీస మద్దతు ధర కిలో రూ.15 ఇచ్చేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని, చంద్రబాబు రైతుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

రైతులను దోపిడీ చేస్తోంది..
ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కూలదోసే ప్రభుత్వమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కలి్పంచకుండా రైతులను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడ మద్దతు ధర కోసం రైతులు ఇక్కడ ఉంచిన 500 ట్రాక్టర్ల లోడును రాత్రికి రాత్రే పోలీసులు ఎలా మాయం చేశారని ప్రశ్నించారు. ఏం జరిగిందో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల పొట్టగొట్టేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement