YSRCP Plenary Festival 2022: కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ

YSRCP Plenary 2022: Single Food Menu from activist to President - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు.

అందరికీ ఒకే మెనూ 
► ప్లీనరీలో పాల్గొనే కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్‌ అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వాటిని తయారు చేయడానికి అవసరమైన వంట సామగ్రి, కూరగాయలు, సరుకులను భారీ ఎత్తున సిద్ధం చేశారు. 
► ఇందుపల్లి, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వంట వాళ్లను రప్పించారు. గురువారం సాయంత్రం నుంచే వారు పని ప్రారంభించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సంప్రదాయ వంటకాలతో వేడి వేడిగా టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్‌ అందించనున్నారు.
► ఇడ్లీ, పొంగల్, ఉప్మా, మైసూర్‌ బజ్జీలను శుక్ర, శనివారం ఉదయం టిఫిన్లుగా అందిస్తారు. 
25 రకాల వంటకాలతో భోజనాలు అందించనున్నారు. శాఖాహారం, మాంసాహార భోజనాలను వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు. 

చదవండి: (దారులన్నీ ప్లీనరీ వైపే)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top