మీడియాతో మాట్లాడుతున్న చెవిరెడ్డి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు
జగనన్న స్ఫూర్తితో ధైర్యంగా ఎదుర్కొంటాం
వైఎస్ కుటుంబంలో 3 తరాల నేతలతో అనుబంధం
చంద్రబాబు సొంత నియోజకవర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై కక్ష.. నాడు జైళ్లలో పెట్టి కొట్టించారు.. ఇప్పుడు 230 రోజులు జైల్లో పెట్టారు
చంద్రబాబూ.. మీరు సంతృప్తి చెందే వరకు కేసులు పెడుతూనే ఉండండి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్) : ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సంతృప్తి పొందే వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చన్నారు. ఇంకా గట్టిగా తయారవుతామని, బెదిరే ప్రసక్తే లేదన్నారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో గురువారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2014–19 మధ్య 72 కేసులు
‘నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైళ్లకు పంపుతూ ఉంటారు. 2014లో నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు. అంతే నన్ను టార్గెట్ చేశారు. 2014–19 మధ్య నాపై 72 కేసులు పెట్టారు. మా చిత్తూరు జిల్లాలోని డిస్ట్రిక్ట్ జైలు మొదలు అన్ని సబ్ జైళ్లలో నెలలపాటు పెట్టించాడు. పక్కనే ఉన్న నెల్లూరు సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైల్లో కూడా పెట్టించారు. అంతటితో వదిలారా అంటే అదీ లేదు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అదే జైళ్లలో నన్ను కొట్టించారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు నా కళ్లకు గంతలు కట్టి నన్ను పోలీసు బస్సులో కింద కూర్చోబెట్టి చాలా అవమానకరంగా తమిళనాడులోని తిరువళ్లూరు వరకు తీసుకెళ్లారు.
అక్కడ బాగా కొట్టారు. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయానికి నన్ను నెల్లూరు జిల్లా సమీపంలోని సత్యవేడు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ రోజు నేను సత్యవేడు పోలీసు స్టేషన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అదే రోజు సాయంత్రం నన్ను కోర్టుకు తీసుకెళుతున్నామని చెప్పి పోలీసు జీపులో ఎక్కించుకుని కేవీబీ పురం మండలంలోని ఒక మారుమూల పల్లె దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నన్ను కోర్టు ముందు హాజరు పరిస్తే పోలీసులు కొట్టిన దెబ్బలు చూపిస్తానని కోర్టుకు తీసుకెళ్లకుండా మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. కేసులు, అరెస్ట్‌లు ప్రారంభించారు. ఈ సారి ఏకంగా 8నెలలు అంటే 230 రోజుల పాటు జైల్లో పెట్టారు.
ఇక మా అమ్మ, నా భార్యపై కూడా కేసులు పెట్టండి
2024 ఎన్నికల్లో నా కొడుకు మోహిత్‌రెడ్డిని సొంత ఊరి నుంచి జగనన్న ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అంతే.. నా కొడుకుపై 10 కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా నాయకుడు జగనన్న నా రెండో కొడుకు హర్షిత్‌రెడ్డిని విద్యార్థి నాయకుడిని చేశారు. అంతే.. ఇప్పుడు వాడిపైనా కూడా కేసులు పెట్టారు. చంద్రబాబు పుట్టిన ఊరిలో మేం పుట్టడం మా తప్పు ఎలా అవుతుంది? మా నాన్న ఎలాగూ లేరు. ఇంక మా ఇంట్లో మిగిలింది మా అమ్మ, నా భార్య. వాళ్లపైన కూడా కేసులు పెట్టేస్తే సకుటుంబంగా చంద్రబాబు బాధితులమవుతాం.
నేను 1988 నుంచి మా నాయకుడు జగనన్న కుటుంబంలోని వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇలా ఒకే కుటుంబంలోని మూడు తరాల నాయకుల వద్ద ప్రియ శిష్యుడిగా కొనసాగాను. ఒక సైనికుడిగా ఉన్నా. వాళ్లు నాకు నేరి్పంది, నేను నేర్చుకొన్నది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా మొండిగా నిలబడి ఎదుర్కోవడమే. ఎన్ని కేసులు పెట్టినా, అసత్యపు ప్రచారాలతో ఎంత అవమానించినా, ఎంత మంది ఒక్కటై దాడులు చేసినా తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని మా లీడర్ జగనన్నను దగ్గరగా చూసి నేర్చుకున్నా.
చంద్రబాబూ.. మీరు ఇష్టం వచ్చినన్ని కేసులు పెట్టుకోండి. మీరు కోరుకున్నన్ని రోజులు జైల్లో పెట్టుకోండి. ఎదుర్కొంటాం. ఇంకా గట్టిగా తయారవుతాం. భయపడేది లేదు. మా జగనన్న వల్లే మాకు ఇంత ధైర్యం’ అని చెవిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నాయకులకు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గ నేతలు, ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు
చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బైయిల్ మంజూరు చేయడంతో వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ధర్మం గెలిచిందంటూ çప్లకార్డులు ప్రదర్శించారు. చెవిరెడ్డి బయటకు రాగానే ఆలింగనం చేసుకున్నారు. మాజీ మంత్రులు జోగి రమే‹Ù, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర జైలు వద్ద చెవిరెడ్డిని కలుసుకున్నారు.
అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో.. చెవిరెడ్డికి బెయిల్
⇒ శ్రీధర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు
⇒ సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాల్లేవు
⇒ వీరి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తి
⇒ ట్రయల్‌కు ముందు సుదీర్ఘ కాలం జైల్లో ఉంచడానికి వీల్లేదు
⇒ అలా ఉంచడం రాజ్యాంగ విరుద్ధం.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే
⇒ ఇదే కేసులో కొందరు సహ నిందితులు ఇప్పటికే బెయిల్ పొందారు
⇒ అందువల్ల ఈ ముగ్గురి బెయిల్ విషయంలో వివక్ష చూపలేం
⇒ ఈ కేసులో పలు అంశాలను ట్రయల్‌లో తేల్చాలి.. ఈ సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే పరిస్థితి లేదు
⇒ అందువల్ల ఈ ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పషీ్టకరణ
సాక్షి, అమరావతి: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వ్యాపారవేత్తలు సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలకు ఆధారాల్లేనందున ట్రయల్‌కు ముందు సుదీర్ఘ కాలం వీరిని జైల్లో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇదే కేసులో కొందరు సహ నిందితులు ఇప్పటికే బెయిల్ పొందినందున ఈ ముగ్గురి విషయంలో వివక్ష చూపలేమంటూ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి 6వ నిందితునిగా, చెరుకూరు వెంకటేష్ నాయుడు 34వ నిందితునిగా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 38వ నిందితునిగా ఉన్నారు. శ్రీధర్‌రెడ్డి గత ఏడాది ఏప్రిల్ నుంచి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గత జూన్ నుంచి జైల్లో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు పలుమార్లు కొట్టేయడంతో వీరు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

వీరి బెయిల్ పిటిషన్‌లపై విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం తీర్పు వెలువరించారు. ‘బెయిల్ మంజూరు చేయడానికి నిర్దిష్ట ఫార్ములా అంటూ ఏదీ ఉండదు. ఒక్కో కేసును బట్టి, అందులోని వాస్తవాల ఆధారంగా బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటాం. ఆర్థిక నేరాల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు నిందితులపై ఉన్న నేరారోపణలు, వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు, నిందితుడి పాత్ర, శిక్ష తీవ్రత, సాక్ష్యాలను తారుమారు చేస్తారా.. ట్రయల్‌కు అందుబాటులో ఉంటారా.. అన్న విషయాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ముగ్గురికి బెయిల్ మంజూరు చేయడానికి గల కారణాలను ఆమె తన తీర్పులో సవివరంగా పేర్కొన్నారు.
చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలేవీ?
38వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఇదే కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నమోదైంది. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ దశలో పరిగణనలోకి తీసుకోలేం. ఇతర బలమైన ఆధారాలు లేకుండా కేవలం సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని బెయిల్ ఇవ్వొద్దనడంపై నిర్ణయం తీసుకోలేం. ఆ సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం వాస్తవికతను ట్రయల్‌లో తేల్చాల్సి ఉంటుంది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తయింది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది.
తీవ్ర ఆర్థిక నేరమని ఆరోపణలు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇదే కేసులో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు సహ నిందితులు బెయిల్ పొందారు. అందువల్ల ఇక్కడ సమానత్వ సూత్రాన్ని అనుసరించాల్సి ఉంటుంది. నిందితుల పట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని కూడా ఈ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో చెవిరెడ్డి పాత్ర పరిమితమైనదని, మిగిలిన వారితో పోలిస్తే తక్కువ తీవ్రత ఉంది. దర్యాప్తు ఓ దశకు చేరుకున్నందున అతన్ని ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు.
శ్రీధర్‌రెడ్డి పాత్ర కీలకమని నిరూపించలేదు
6వ నిందితునిగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి గత ఏడాది మే 24 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. డిజిటల్ ఉపకరణాల ఫోరెన్సిక్ పరిశీలన, డాక్యుమెంటరీ ఆధారాల సేకరణ, శ్రీధర్‌రెడ్డి పాత్రపై దర్యాప్తు దాదాపుగా పూర్తయ్యాయి. దర్యాప్తు సంస్థ సేకరించిన ఆధారాలు ఎంత వరకు నిజం.. అవి కోర్టు ముందు నిలబడతాయా లేదా అన్న విషయాలను లోతుగా పరిశీలించేందుకు ఇది సరైన సమయం కాదు. కేసులో నిందితుడి ప్రమేయం ఎంత వరకు ఉందన్నదే కోర్టుకు ప్రాథమికంగా కావాల్సింది. ఎఫ్‌ఐఆర్, ప్రాథమిక ఆధారాలు శ్రీధర్‌రెడ్డి పాత్రపై అనుమానాలు కలిగిస్తున్నా, అతని పాత్ర అత్యంత కీలకమైనదని నిరూపించే బలమైన, తిరుగులేని ఆధారాలేవీ కనిపించడం లేదు.
విచారణ పూర్తి కాక ముందే ఓ వ్యక్తిని సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది. నేర తీవ్రతను, నిందితుని వ్యక్తిగత స్వేచ్ఛను సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ కోర్టుపై ఉంది. కస్టడీలో ఉంచి విచారించాల్సిన అవసరం లేనప్పుడు నిందితుడ్ని జైల్లో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బెయిల్‌పై శ్రీధర్‌రెడ్డి బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ ఆందోళనకు ఎలాంటి ఆధారాలను మాత్రం చూపలేదు. నిందితుడు చట్టం నుంచి పారిపోయే అవకాశం లేనప్పుడు, దర్యాప్తు దాదాపుగా పూర్తయిన సందర్భాల్లో బెయిల్ ఇవ్వడమే సముచితం.
సాక్షుల వాంగ్మూలాలతో ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?
34వ నిందితునిగా ఉన్న వెంకటేష్ నాయుడు గత ఏడాది జూన్ 18 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇతనికి సంబంధించిన దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. దర్యాప్తు సంస్థ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. 414 మంది సాక్షులను దర్యాప్తు సంస్థ విచారించింది. ఈ కేసులో ఉన్న ఆధారాలు, నిందితుల సంఖ్య, ప్రస్తుత కేసు దశలను పరిగణనలోకి తీసుకుంటే, సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే అవకాశం లేదు. రికార్డుల్లో ఉన్న ఆధారాలను చూస్తే, అతడికి ఆపాదించిన పాత్ర కేవలం అనుమానాల ఆధారంగా మాత్రమే ఉంది. దర్యాప్తు సంస్థ వెంకటేష్ నాయుడి నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి నగదు స్వాధీనం చేసుకోలేదు. కుట్ర వ్యవహారాన్ని పర్యవేక్షించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా ట్రయల్‌లో తేల్చాల్సిన అంశాలు. ఇద్దరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే వెంకటేష్ నాయుడిపై కేసు నమోదు చేశారు
ఆ సాక్ష్యాల వాస్తవికత ఎంత అన్న విషయం ట్రయల్‌లోనే తెలుస్తుంది. వాటిని ఈ దశలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ కేసులో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న సహ నిందితులు బెయిల్ పొందారు. ట్రయల్ పూర్తి కాక ముందే నిందితుడిని ఎక్కువ కాలం జైల్లో ఉంచడం శిక్ష విధించడం కిందకే వస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అరెస్టయిన తర్వాత దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు, సాక్షులను బెదిరించినట్లు, సాక్ష్యాలను తారుమారు చేసినట్లు అతనిపై ఎలాంటి ఆరోపణలు లేవు. దర్యాప్తు సంస్థ వ్యక్తం చేస్తున్న భయాందోళనలను కఠిన షరతుల ద్వారా తొలగిస్తాం. సమీప కాలంలో ట్రయల్ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇతనికి బెయిల్ మంజూరు చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఈ ముగ్గురిని హైకోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలంది. కాగా, ఈ కేసులో మొదటి నిందితునిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. 7వ నిందితునిగా ఉన్న ముప్పిడి అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సైతం కొట్టేసింది.


