నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం
ఉయ్యూరు: అశేష భక్తజన తిరుగుడు గండ దీప హారతుల నడుమ ఉయ్యూరు వీరమ్మతల్లి ఊయల ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. మెట్టినింటి నుంచి గ్రామోత్సవంగా బయలుదేరిన అమ్మవారు గురువారం పట్టణంలో ఊరేగారు. శ్రీ కనక చింతయ్య సమేతంగా వీరమ్మతల్లి పల్లకీలో ముందుకు సాగగా.. దారిపొడవునా భక్తులు హారతులు ఇచ్చి పసుపు నీరు ఓరబోసి పసుపు కుంకుమ సమర్పించారు. కాటూరు రోడ్డు, సాయి మహల్ సెంటర్, కౌండిన్య ప్రాంగణం, కాపుల రామాలయం సెంటరు, కొబ్బరి తోట, సుందరమ్మపేట, శివాలయం రోడ్డులో అమ్మవారి పల్లకికీ పూలతో స్వాగతం పలికారు. యువత బాణసంచా కాలుస్తూ విద్యుత్ కాంతులతో బ్రహ్మరథం పట్టారు. వైభవంగా గ్రామోత్సవం పూర్తి చేసుకున్న అమ్మవారు ఊయలస్తంభాల వద్దకు చేరుకోగా.. అక్కడ ఊయల ఉత్సవం జరిపించారు.
సంప్రదాయం ప్రకారం..
ఆనవాయితీ ప్రకారం అమ్మవారి వంశస్తులు పారుపూడి, నెరుసు వంశస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారిని ఊయల ఊపి ప్రత్యేక భక్తి గీతాలు ఆలపించారు. అమ్మవారి ఊయల ఉత్సవాన్ని కనులారా వీక్షించి భక్తజనం భక్తిపారవశ్యం చెందారు. మూడు పర్యాయాలు అమ్మవారు ఊయల ఊగి అనంతరం ఆలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా భక్తజనం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిని దర్శించుకుని తరించారు. తిరుగుడు గండ దీప భక్తులు అమ్మకు దీపం సమర్పించి ఉపవాస దీక్ష విరమించారు. అమ్మవారి తిరునాళ్లలో సేవాభావం వెల్లివిరిసింది. పట్టణంలోని అన్ని రహదారుల్లో వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అల్పాహారం, తాగునీరు, ఇతర వసతులు కల్పించారు.
వీరమ్మతల్లికి అడుగడుగునా భక్త నీరాజనం
నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం
నేత్ర పర్వం.. ఊయల ఉత్సవం


