ప్రాయశ్చిత్త దీక్ష చేసినా పాపం పోదు
భక్తుల కాళ్లు కడగాలి..
● చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోళ్లను
పినాయిల్‌తో కడగాలి
● దుర్గగుడిలో వైఎస్సార్ సీపీ నేతల పూజలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్న చరిత్ర సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌దని, లడ్డూలపై అసత్యాలు పలికిన వారి నోళ్లను పినాయిల్‌తో కడగాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని సీబీఐ ఇచ్చిన రిపోర్డుపై వైఎస్సార్ సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారికి గురువారం వైఎస్సార్ సీపీ నేతలు పూజలు నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఘాట్‌రోడ్డు సమీపంలోని దేవస్థాన కేశఖండనశాల వద్ద మీడియాతో మాట్లాడారు.
భక్తులందరికీ క్షమాపణలు చెప్పాలి..
దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా తమ నీచ రాజకీయాల కోసం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ దేవుడిని వాడుకున్నారన్నారు. తిరుమల లడ్డూలో పందికొవ్వు, పశు కొవ్వు కలిసిందని చెప్పిన చంద్రబాబు మాటలు విని పవన్‌కల్యాణ్ దుర్గగుడి మెట్లు కడిగారని, ఇప్పుడు దుర్గగుడి మెట్లు మరోసారి కడిగి భక్తుందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బుడమేరు వరదల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైన సందర్భంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. సీబీఐ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఏ ఒక్క కూటమి నేతకు మాటలు రావడం లేదన్నారు. నిజాలను ఎల్లో మీడియా తప్పుదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. పరిపాలన చేతకాక, ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ఆదరణను తట్టుకోలేక అసత్యాలను ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఐదేళ్లలో తిరుమల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారని, తిరుమల ఖ్యాతిని పెంచిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు. వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి కుటుంబాలకు కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలన్నారు.
వారికి ప్రాయశ్చిత్తం లేదు..
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సనాతన ధర్మం అంటూ 11 రోజుల పాటు దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు నెయ్యిలో కల్తీ జరగలేదని ఒప్పుకొని మరో మారు దుర్గగుడి మెట్లు కడగాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ తిరుపతికి కాలి నడకన వెళ్లి లెంపలేసుకుని వేంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలన్నారు. పవన్ పాపాలకు అలిపిరి మెట్లు కడిగినా ప్రాయశ్చితం కలగదన్నారు. టీటీడీకీ చైర్మన్‌గా ఉండే అర్హత బి.ఆర్. నాయుడుకు లేదని, తిరుమల ఖ్యాతిని తగ్గించేలా కొన్ని చానెళ్లు తప్పుడు కథనాలు ఇస్తున్నాయని, భక్తులందరూ ఆ చానెళ్లను బ్యాన్ చేయాలన్నారు.
రాజీనామా చేయాలి..
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూపై అసత్యాలు ప్రచారం చేసిన వారికి మొట్టి కాయలు వేయాలని దుర్గమ్మను కోరుకున్నామని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్ సీపీని హిందువులకు దూరం చేయాలని కూటమి నేతలు కుట్ర చేశారన్నారు. తక్షణమే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
విజయవాడ నగర మేయర్, వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని నేషనల్ డైరీ ల్యాబ్ గత ఏడాదే తేల్చి చెప్పిందన్నారు. ఇప్పుడు సీబీఐ, సిట్ రిపోర్టు ఇచ్చిందని పేర్కొన్నారు. లడ్డూ కల్తీ జరిగిందని భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తిరుమలలో భక్తుల కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పాలన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లాడుతూ లడ్డూ కల్తీ జరిగిందని భక్తుల నమ్మకంతో ఆటలాడిన చంద్రబాబునాయుడు అండ్ కో పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, ఫ్లోర్‌లీడర్ వెంకట సత్యనారాయణ, ఆళ్ల చెల్లారావు, దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, పగిడిపాటి చైతన్యరెడ్డి, శీరంశెట్టి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


