ఇప్పుడు పేలినవి 2024లో స్వాధీనం చేసుకున్నవి గాయపడిన వారు కోలుకుంటున్నారు ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్
చల్లపల్లి: చల్లపల్లి పోలీస్టేషన్‌లో భారీ విస్ఫోటనానికి కారణం ఉల్లిపాయ బాంబులని, వాటిని 2024లో స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి చల్లపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, చల్లపల్లి ఎస్‌ఐ కె.ఈశ్వరరావు ఘటన వివరాలను ఐజీపీకి వివరించారు. ఐజీపీ అశోక్ కుమార్‌తో పాటు అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, అవనిగడ్డ ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు ఉన్నారు.
సాధారణ ప్రక్రియలో భాగంగానే..
ఐజీపీ అశోక్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ 2024లో ఒక కేసులో సుమారు 1000 ఉల్లి బాంబులను, 2025 అక్టోబర్‌లో రెండు కేసులకు సంబంధించిన క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన వాటిని ఎవ్వరికీ ఇవ్వకుండా కోర్టు అనుమతితో నిర్వీర్యం చేస్తామని, ప్రమాద ప్రభావం తక్కువగా ఉండే క్రాకర్స్‌ను బల్క్‌గా ఆక్షన్ నిర్వహించి బయటకు ఇస్తామన్నారు. ప్రస్తుతం 2025 అక్టోబర్‌లో సీజ్ చేసిన క్రాకర్స్ స్థానికంగా ఉన్న ఓ క్రాకర్స్ స్టోర్‌లో భద్రపరిచామని, 2024లో పట్టుకున్న ఉల్లి బాంబులను నిల్వ ఉంచుకోవటానికి క్రాకర్స్ షాపు వారు నిరాకరించటంతో వాటిని స్థానిక స్టేషన్‌లోని ఓమూల నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన గదిలో ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా దానికి సంబంధించిన కేసు కొట్టివేయటంతో వాటిని నిర్వీర్యం చేసే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వివరించారు.
అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశాం..
చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనతో మిగిలిన అన్ని స్టేషన్లను అలర్ట్ చేశామని ఐజీపీ చెప్పారు. ముఖ్యంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే ఉల్లి బాంబులు లాంటివి స్టేషన్లలో పెట్టుకోకుండా వెంటనే తగు జాగ్రత్తలు పాటించి వాటిని నిర్వీర్యం చేయాలని సూచించినట్లు తెలిపారు. ఇలాంటి మందుగుండు సామగ్రిని సాధ్యమైనంత త్వరగా నిర్వీర్యం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టువారి దృష్టికి తీసుకు వెళతామన్నారు.
అమ్మకాలు నిషేధిస్తాం..
ఇక నుంచి క్రాకర్స్ అమ్మే అన్ని షాపుల్లో ప్రమాదకరమైన ఉల్లి బాంబుల అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తామని ఐజీపీ చెప్పారు. ఎవరైనా వాటిని అమ్మితే వారిపై కేసులు నమోదు చేస్తామని వారి షాపుల లైసెన్సులు కూడా రద్దు చేయిస్తామని హెచ్చరించారు.
కోలుకుంటున్నారు..
ప్రమాదంలో గాయపడి, గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, డ్రైవర్ డి.నాగరాజులు కోలుకుంటున్నారని ఐజీపీ చెప్పారు. కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా ఇంకా క్రిటికల్ కేర్‌లోనే ఉన్నారన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా పోలీస్ డిపార్ట్‌మెంటే భరిస్తుందని ఆయన చెప్పారు.


