నిర్బంధించి.. నిర్దాక్షిణ్యంగా.. | - | Sakshi
Sakshi News home page

నిర్బంధించి.. నిర్దాక్షిణ్యంగా..

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ ధ్వంసం టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అంటూ బాధితుల ఆరోపణ ఆత్మహత్య తప్ప తమకు వేరే దారిలేదని ఆవేదన

డబ్బులు ఇవ్వలేదని కూల్చివేశారు

మచిలీపట్నంటౌన్‌: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో నగరపాలక సంస్థ అధికారులు బుధవారం మరో కూల్చివేతల పర్వానికి తెరలేపారు. నగరంలోని 6వ డివిజన్‌ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహా న్ని భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ పొక్లయినర్‌తో కూల్చివేశారు. తమ గృహాన్ని కూల్చివేయవద్దని బాధితులు అడ్డుపడినా పోలీసులు ఈడ్చిపారేశారు. జన సేన పార్టీ సానుభూతిపరులైన గృహనిర్మాణదారులను పోలీసులు నిర్భందించి ఈ కూల్చివేత పర్వం నిర్వహించటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికి కట్టి ఉన్న జనసేన జెండాలు సైతం ఊడబెరికి కూలగొట్టడం గమనార్హం.

స్టే వెకేట్‌ కావడంతో..

నిర్మాణాలకు సంబంధించి ఇటీవలే కోర్టు స్టే వెకేట్‌ కావటంతో నిర్మాణదారులు భవన శ్లాబు పనులు చేపట్టారు. శ్లాబ్‌ పనులు పూర్తయిన అనంతరం టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మునిసిపల్‌, పోలీస్‌ యంత్రాంగం బుధవారం ఒక్కసారిగా యుద్ధానికి వెళ్లినట్లుగా పొక్లయినర్‌తో చుట్టుముట్టి బాధితులను నిర్బంధించి ఈ చర్యకు పాల్పడటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

బాధితుడు ఆత్మహత్యాయత్నం..

తమకు ముందస్తు సమాచారం లేకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న గృహాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. పెట్రోల్‌ పోసుకుని చనిపోవటం తప్ప తమకు వేరే దారిలేదని బాధితుడు పెట్రోల్‌ పోసుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు పేర్కొన్నారు. తమ గృహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఎందుకు కూలుస్తారంటూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నిర్భందించారు. దీనిపై మునిసిపల్‌ అధికారులను మీడియా ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.

నిర్మాణంలో ఉన్న జనసేన

సానుభూతిపరుడి ఇల్లు కూల్చివేత

అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌, టీడీపీ నాయకుడు దిలీప్‌కు తాము ఆయన అడిగిన డబ్బులు ఇవ్వలేదనే కక్షతో రెండురోజుల క్రితం నిర్మించిన శ్లాబుతో ఉన్న ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. తాము తక్కువ మొత్తానికి భూమిని కొనుగోలు చేశామని అందువల్ల గజానికి రూ. 5వేలు చొప్పున తనకు ఇస్తే గృహం నిర్మించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని లేకుంటే గృహంనిర్మించుకోనివ్వనని ఆయన హెచ్చరించాడు. పక్కా డాక్యుమెంట్లు ఉన్న తాము ఆయనకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాం. అప్పటి నుంచి తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ.. అధికార దర్పంతో మునిసిపల్‌, పోలీస్‌ శాఖల అధికారులతో ఈ దౌర్జన్య కాండకు దిగారు. మంత్రి కొల్లు రవీంద్రకు దిలీప్‌ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని తాను వెళ్లి చెప్పినా తాను చేసేది చేస్తానని తేల్చి చెప్పారు.

– శ్రీపతి వెంకటాచలం, బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement