సాక్షి, కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆరో వార్డులో అధికారులు.. అక్రమంగా ఇల్లును కూల్చేసిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టును సీఐ అడ్డుకున్నారు. పేర్ని కిట్టుపై పరుష పదజాలంతో సీఐ పరమేశ్వర్ రెచ్చిపోయారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఐ వ్యాఖ్యలపై పేర్ని కిట్టు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీఐ తీరుపై వైస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఇంటి కూల్చివేతపై ఆదేశాలను చూపాలంటూ కార్పొరేషన్ అధికారులను పేర్ని కిట్టు నిలదీశారు. మున్సిపల్ అధికారులు.. పొంతనలేని సమాధానాలను చెబుతూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కాగా, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో నగరపాలక సంస్థ అధికారులు నిన్న (బుధవారం) మరో కూల్చివేతల పర్వానికి తెరలేపారు.
నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్‌తో కూల్చివేశారు. తమ గృహాన్ని కూల్చివేయవద్దని బాధితులు అడ్డుపడినా పోలీసులు ఈడ్చిపారేశారు. జనసేన పార్టీ సానుభూతిపరులైన గృహనిర్మాణదారులను పోలీసులు నిర్భందించి ఈ కూల్చివేత పర్వం నిర్వహించటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటికి కట్టి ఉన్న జనసేన జెండాలు సైతం ఊడబెరికి కూలగొట్టడం గమనార్హం.
నిర్మాణాలకు సంబంధించి ఇటీవలే కోర్టు స్టే వెకేట్ కావటంతో నిర్మాణదారులు భవన శ్లాబు పనులు చేపట్టారు. శ్లాబ్ పనులు పూర్తయిన అనంతరం టీడీపీ నాయకుల ఫిర్యాదుతో మునిసిపల్, పోలీస్ యంత్రాంగం బుధవారం ఒక్కసారిగా యుద్ధానికి వెళ్లినట్లుగా పొక్లయినర్‌తో చుట్టుముట్టి బాధితులను నిర్బంధించి ఈ చర్యకు పాల్పడటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

తమకు ముందస్తు సమాచారం లేకుండా వేలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించుకున్న గృహాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చివేశారని బాధితులు వాపోయారు. పెట్రోల్ పోసుకుని చనిపోవటం తప్ప తమకు వేరే దారిలేదని బాధితుడు పెట్రోల్ పోసుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులు పేర్కొన్నారు. తమ గృహాన్ని నిర్ధాక్షిణ్యంగా ఎందుకు కూలుస్తారంటూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని నిర్భందించారు. దీనిపై మునిసిపల్ అధికారులను మీడియా ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు ఇచ్చారు.


