‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’ | Ysrcp Perni Nani Slams Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’

Apr 3 2026 10:58 AM | Updated on Apr 3 2026 11:20 AM

Ysrcp Perni Nani Slams Chandrababu Government

సాక్షి, మచిలీపట్నం: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూల్చివేసిన ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని, కిట్టుపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదు చేశారు. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్‌ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పీఎస్‌లో కేసు నమోదు  చేయగా.. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో పేర్ని నాని ఇవాళ (ఏప్రిల్‌ 3, శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. ‘‘దోపిడీ దారులను నిలదీయడమే మా కర్తవ్యం.. మీరెన్ని అక్రమ కేసులు బనాయించిన ప్రశ్నించడం ఆగదు’’అని తేల్చి చెప్పారు. కొంతమంది పోలీసులు.. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పనా?’’ అంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వ హయాంలో ఎవరి ఇళ్లు కూల్చలేదన్న పేర్ని నాని.. శాంతి భద్రతల విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పబ్లిసిటి కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

‘‘మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సీఐ అనొచ్చా. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మచిలీపట్నంలో సీఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని మేం కొట్టించాం. మేం ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సీఐ వచ్చి బందోబస్తు ఇచ్చారు. వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా?. నువ్వు నువ్వు మీరు అనొచ్చు... మేం అనకూడదా?. నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?

..గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి?. నేను సీఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా?. పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం?. మీరు పెట్టే అక్రమ కేసులు నిలబడతాయా?. కంకిపాడులో పేకాట ఆడిస్తున్నందుకు పరమేశ్వర్ సస్పెండ్ అయ్యాడు. మీకు చేతనైతే ఆ విషయం పై స్పందించండి. నేను పబ్లిసిటీ, రాజకీయ ఎదుగుదల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడేవారికి అండగా ఉండటమే నా ఉద్యోగం

..పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే నా పని. మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రాన నేను ప్రశ్నించడం ఆగదు. జైలు లోపల ఉన్నా ప్రశ్నిస్తూనే ఉంటా. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు తాగుతున్నారు. నేను పోలీసు వ్యవస్థ అంతటినీ కించపరిచినట్లు మాట్లాడటం సరికాదు. ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి లోపల వేస్తున్న నియంత పాలన సాగుతోంది. జైపాల్‌తో కృష్ణాజిల్లాలో ఉన్న పోలీసులందరికీ మోటివేషన్ క్లాసులు పెట్టించాలని ఎస్పీని కోరుతున్నాం. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్రులో ఓ సీఐని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయించారు. 2014లో కొల్లు రవీంద్ర మంత్రి మచిలీపట్నం తాలూకా సీఐని విధుల్లో చేరకుండా అడ్డుకున్నాడా లేదా?.

..డీజీపీ చెప్పినా కుదరదని కొల్లు రవీంద్ర చెప్పిన విషయం మీకు గుర్తులేదా?. డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు పోస్టింగ్ లు రావడం లేదని జైపాల్ తెలుసుకోవాలి. పేర్ని నాని ఎప్పుడూ.. ఎన్నడూ పోలీస్ శాఖను బెదిరించలేదు. తప్పుడు పనులు చేసే వారిని, రాజకీయనాయకులకు తొత్తులుగా ఉన్నవారినే నేను హెచ్చరించా. ఒకడు లంచం తీసుకుంటే పోలీసులంతా లంచం తీసుకున్నట్లేనా?. తప్పుడు పనులు చేసేవారిని ప్రశ్నించడం నేరమా?.. నేను చేసింది నేరమే అయితే మీరు ఏం చేసినా శిరసా వహిస్తా

..కొల్లు రవీంద్ర ఎంతోమంది పోలీసుల పట్ల అమర్యాదగా వ్యవహించారు. అప్పుడు పోలీసు విధి నిర్వహణలో జైపాల్ బాగా బిజీగా ఉన్నట్లున్నారు. ఒక అధికారి ఒక చోట రెండేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని పోలీస్ రూల్. పోలీస్ యూనిఫాం మాటున తప్పుడు పనులు చేసే వారిని మాత్రమే నేను అన్నా. వారి జాబితాలో మిమ్మల్ని ఎందుకు కలుపుకుంటారు. నేను ప్రెస్ మీట్లలో ఏ ఒక్క పోలీసు అధికారిని ఏకవచనంతో మాట్లాడలేదు. తండ్రి వయసున్న వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చా. కొడుకు వయసున్న పేర్ని కిట్టు మాట్లాడితే మీకు తప్పైపోయిందా?.

నిన్న మీరు విడుదల చేసిన మున్సిపల్ కమిషనర్ లెటర్ అసలైనదేనా ఓసారి చెక్ చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ సంతకం చేశారా?. మీరు హడావిడిగా చేయించారా?. మీరు విడుదల చేసిన లెటర్‌లో మున్సిపల్ కమిషనర్ సంతకం ఒరిజినల్ ది కాదు. పామర్రు స్టేషన్ లో సీసీ ఫుటేజ్ కూడా ఇప్పిస్తారా?. ఆ ఫుటేజ్ ఇప్పించండి నేను క్షమాపణ చెబుతా. కుమ్మరిగూడెంలో పేదల ఇళ్లను కూల్చడానికి బందోబస్తు ఇచ్చారు. బందోబస్తు రిక్విజేషన్ లెటర్ ఇవ్వండి నేను పోలీసుల పాత్ర గురించి మాట్లాడను. పామర్రు స్టేషన్ ఓ దళిత యువతిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని పోలీసులను కొట్టినట్లు ఫుటేజ్‌ను విడుదల చేయండి.

..ఆ ఫుటేజ్ విడుదల చేస్తే నేను కచ్చితంగా నా మాటకు కట్టుబడి ఉంటా. అనేక మార్లు రౌడీ వెధవలు నా ఇంటి మీదకు వస్తే నా కార్యకర్తలు నాకు రక్షణగా నిలిచారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గన్‌మెన్‌లు లేకుండానే బందరులో తిరిగాను. ఎందుకు మంత్రి వెంట లేరని నా గన్‌మెన్ లకు అనేక సార్లు మెమో ఇచ్చారు. కావాలంటే నాదగ్గర గన్‌మెన్‌లుగా చేసిన వారిని అడిగి చూడండి. నాకు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసంలో కుక్కతో నేను పోటీపడతా. నేను పోలీసు శాఖతో ఎప్పుడూ అమర్యాదగా వ్యవహరించలేదు.

..నాపై హత్యాయత్నం జరిగితే నేటికీ ఆ కేసు ముందుకు సాగడం లేదు. మహిళా జడ్పీ చైర్ పర్సన్ పై హత్యాయత్నం జరిగితే ఇంతవరకూ దర్యాప్తు కూడా చేయలేదు. ఆరేళ్ల క్రితం సంబరాల రాంబాబు అని పోస్టు పెట్టిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎవరు ఫిర్యాదు చేశారని కేసు పెట్టి దళిత యువకుడిని జైల్లో పెట్టారు. బాషా కళ్లల్లో ఆనందం కోసం అక్రమ కేసులు పెట్టడమేనా మీ పని అన్యాయాన్ని ప్రశ్నించిందని ఓ దళిత యువతిని కొట్టి జైల్లో పెట్టారు. మీ ఇష్టానుసారంగా కేసులు పెడితే ఎవరినీ ప్రశ్నించకూడదా?, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి జైపాల్ సార్. మా అబ్బాయి పేర్ని కిట్టును మీ దగ్గరకు శిక్షణ కోసం పంపిస్తా’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement