ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగింపు
స్థలం కేటాయింపుపై చేసిన విజ్ఞప్తిపై ఉత్తర్వులు రాకుండానే కాంపౌండ్ వాల్ ధ్వంసం
పూర్వపు ఈఓ మౌఖిక ఆదేశాలతో నిర్మాణం
అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు
శ్రీశైలం: ఊరూపేరూ ఎవరికీ తెలియని ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం శ్రీశైలం క్షేత్ర పరిధిలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రహరీని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ దురాగతంపై భక్తులు మండిపడుతున్నారు. వివరాలివీ..రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్న సాకుతో అధికారులు శ్రీశైలంలోని కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రహరీని గురువారం ఉదయం నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు.
నిజానికి ఈ స్థలం కేటాయింపునకు సంబంధించి తీర్మానం చేసిన ఫైల్ రాష్ట్ర దేవదాయ కమిషనర్ వద్ద ఉంది. అయితే అక్కడ నుంచి ఉత్తర్వులు రాకుండానే కాంపౌండ్ వాల్ కూల్చివేయడం గమనార్హం. మరోవైపు.. భక్తులు సేదతీరేందుకు ప్రహరీని తొలగించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కరివేన సత్రానికి 43 సెంట్లు కేటాయించామని.. అయితే, పూర్వపు ఈఓ మౌఖిక ఆదేశాల మేరకు అదనంగా 55 సెంట్లు ఆక్రమించుకుని సత్రం నిర్వాహకులు కాంపౌండ్ వాల్ నిర్మించారన్నారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు..
ఈ విషయంపై కరివేన సత్రం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ స్పందిస్తూ.. సత్రం కాంపౌండ్ వాల్‌కు సంబంధించిన స్థలం కేటాయింపుపై కమిషనర్‌ను అభ్యర్థించామని.. ఇంతలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ప్రహరీని కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై సత్రం కార్యనిర్వాహక సభ్యులు రెండు రోజుల్లో శ్రీశైలం వచ్చి దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ పోతుగంట రమేష్‌నాయుడుతో చర్చించనున్నట్లు తెలిపారు.


