బోర బృందావతి కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం అందజేస్తోంది. సోమవారం పలు కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున చెక్‌లను అందించగా, మంగళవారం కూడా పలువురు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన నిఖిల్ కుటుంబ సభ్యులకు, వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటలో మురిపింటి నీలమ్మ కుటుంబ సభ్యులకు, కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన డొక్కరి అమ్ముడమ్మ కుటుంబ సభ్యులకు, అలాగే మందస మండలం మందస గ్రామానికి చెందిన బోర బృందావతి, బెల్లు పట్టియా గ్రామానికి చెందిన దువ్వ రాజేశ్వరి కుటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పాల్గొన్నారు.


