తాడేపల్లి : పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలబడింది. సాల్మన్ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. ఇఘ్పటికే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సాల్మన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. అదే సమయంలో సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా సాల్మన్ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించింది వైఎస్సార్‌సీపీ.
కాగా, టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే..
వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..
సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత కన్నుమూశాడు.


