కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు.. | YSRCP Counter To Chandrababu Municipal Election Allegations | Sakshi
Sakshi News home page

కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు..

Oct 20 2026 6:01 AM | Updated on Oct 20 2026 6:01 AM

YSRCP Counter To Chandrababu Municipal Election Allegations

ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బెదిరింపా బాబూ?

ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు చేయడాన్ని బెదిరింపుగా వక్రీకరణ

ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూనే నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య ప్రవచనాలు

జగన్‌ ప్రశ్నలకు జవాబు చెప్పలేక వ్యక్తిగత దూషణలు

వాస్తవానికి గతంలో ఎస్‌ఈసీ ద్వివేదిని బెదిరించింది మీరే

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అడుగడుగునా దౌర్జన్యాలు, అక్రమాలు, బెది­రింపులు, పత్రాల చింపివేతలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంటే.. వాటన్నింటిపై ఆధారాలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని సీఎం చంద్రబాబు పక్కదారి పట్టించే కుతంత్రానికి తెరలేపారు.

కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెబుతూ నిస్సిగ్గుగా ఫిర్యా­దును బెదిరింపుగా వక్రీకరించి రాజకీయ లబ్ధి పొం­దేం­దుకు యత్నించడం విస్తుగొలుపుతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దారుణంగా దాడులు చేయడం, నామినేషన్లు వేయనీయకపోవడం వంటి వాటి గురించి ఆధార సహితంగా ఫిర్యాదు చేయడం లోకమంతా చూసినా, చంద్రబాబు మాత్రం దాన్ని బెదిరింపుగా చిత్రీకరించారు. సోమవారం అనుకూల మీడియాతో నిర్వహించిన సమావేశంలో గంటన్నరపాటు ఆయన తన సహజశైలిలో కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు వల్లెవేశారు.

నిజానికి.. ఒక పార్టీ అధ్యక్షుడు అధికార పార్టీ అరాచకాలపై ఫిర్యాదు చేయడానికి రాజ్యాంగ వ్యవస్థల తలుపు తట్టడం బెదిరింపు ఎలా అవుతుంది? మీడియా సమక్షంలో ఫిర్యాదు చేయడం తప్పా? ఎన్నికల కమిషనర్ల నియామక విధానాన్ని జగన్‌ ప్రశ్నిం­చడం చంద్రబాబుకు తప్పుగా కనిపించడం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో నియామకాలు జరుగుతున్నాయని.. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ కమిటీ ద్వారానే నియామకాలు జరగాలని డిమాండ్‌ చేస్తే అందులో తప్పేంటో చెప్పకుండా రాజకీయ ఆరో­పణలకు దిగారు.

ప్రజాస్వామ్య ప్రవచనాలు  
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ప్రజాస్వామ్యానికి పాతరేసి అదే ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు ఈ మీడియా సమావేశంలో ప్రవచనాలు వల్లెవేశారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పర్వాన్ని దారుణ హింసాకాండగా మార్చి, దానిగురించి ఏమీ తెలీనట్లు నంగనాచి కబుర్లు చెప్పారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రం గడప తొక్కాలంటేనే ప్రాణాలకు తెగిం­చాల్సిన పరిస్థితి తీసుకురావడం.. పచ్చమూక­లు రాళ్లు, రాడ్లతో దాడులు చేయడం, టీడీపీ గూండాలతో కలిసిపోయి ఖాకీలు చేసిన అరాచకాలు, ఆర్వోలు నామినేషన్‌ పత్రాలే తీసుకోకపోవడం వంటివేమీ చంద్రబాబు దృష్టిలో తప్పులు కాదట.

ఈ అరాచకానికి సూత్రధారి తానే కావడంతో నిస్సిగ్గుగా దొంగ నవ్వులతో వాటిని సమర్థించుకున్నారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యా­యత్నం చేయించిన చంద్రబాబు.. ఇప్పుడేమీ ఎరుగనట్లు ఎదురుదాడి చేస్తున్నారు. ఎంపీ కారులో మద్యం, మారణాయుధాలు దొరికాయని ఆయనే తీర్పు చెప్పేశారు. ప్రతిపక్ష నేత జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో పోలీసులు వైఎస్సా­ర్‌సీపీ కార్యాలయం చుట్టూ ముళ్లకంచెలు వేయ­డం బాబు పాలనలో అమలవుతున్న ప్రజాస్వామ్యం.

సీఎం మాట్లాడే భాష ఇదా?
ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడిన చంద్రబా­బు అదే ప్రెస్‌మీట్‌లో సంస్కారం మరిచి ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒక మాజీ సీఎంను అండర్‌ వరల్డ్‌ డాన్, నక్సలైట్లు, తీవ్రవాదులతో పోల్చి తన బజారు భాషను బయట పెట్టుకు­న్నా­­రు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరిపైనా గంజా­యి బ్యాచ్‌ ముద్రవేసి బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, చదు­వుకున్న యువతను అవమానించారు. సోషల్‌ రీ–ఇంజినీరింగ్‌ అని గొప్పలు చెప్పుకుంటూనే అదేవర్గాల ప్రత్యర్థి అభ్యర్థులపై నోరుపారేసుకున్నారు. వాస్తవా­నికి గతంలో స్థానిక ఎన్నికలప్పుడు అప్పటి ఎస్‌ఈసీ ద్వివేదిని బెదిరించింది చంద్రబాబే. ఈ విషయం ఎవరికీ తెలియదన్నట్లు ఇప్పుడు చంద్రబాబు కబుర్లు చెబుతుండటం విస్తుగొలుపుతోంది.

జేపీతో పోలికా? సిగ్గుచేటు! 
ఇక తన అరెస్టును జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంతో పోల్చుకోవడం చంద్రబాబు అతిశయోక్తులకు పరాకాష్ఠ. వాస్తవానికి.. జేపీ జైలుకు వెళ్లింది ప్రజాస్వా­మ్యం కోసం పోరాడినందుకు. కానీ, చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో. అవినీతి కేసులో అరెస్టును ప్రజాస్వామ్య పోరాటంగా నిస్సిగ్గుగా చిత్రీకరించుకోవడం బాబుకే చెల్లింది.

రెండున్నరేళ్లయినా అదే సోది
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటికీ ప్రతి సమస్యకూ గత ప్రభుత్వాన్నే కారణంగా చూపు­తూ చంద్రబాబు సోది వినిపిస్తున్నారు. చెత్త పేరుకు పోవడం, జల్‌జీవన్‌ మిషన్, పోలవరం డ­­యాఫ్రం వాల్, ఆలయాలు, అమరావతి, భూ రికార్డులు.. అన్ని­టికీ అదే సాకు. రెండున్నరేళ్లలో తా­ను చేసింది చెప్పుకోవడానికి ఏమీలేకే ఇంకా గత ప్రభుత్వంపైనే నిందలు వేస్తూ కట్టు కథలు చెబుతున్నా­రు. ఇప్పుడు కళ్ల ముందే విధ్వంసం చేస్తూ, అదే­దో ఎప్పుడో జరిగిందంటూ కట్టుకథలు చెబుతున్నారు.

సూపర్‌ సిక్స్‌పైనా అబద్ధాల పర్వం
సూపర్‌ సిక్స్‌ను అమలు చేయకుండా ప్రజలను వంచించి.. అన్నీ అమలు చేసేశామని బాబు పచ్చి అబద్ధా­లు చెప్పారు. దసరా ఉత్సవాలు బాగా జరిగాయంటే అది ఉచిత బస్సు పుణ్యమేనని చెప్పుకోవ­డం చంద్రబాబు ప్రచార పిచ్చికి పరాకాష్ట. గంటన్నర ప్రెస్‌మీట్‌లో తన సహజ శైలిలో కళ్లు మూసుకుని అబద్ధాలు వల్లెవేసిన చంద్రబాబు అసలు ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.

పుంగనూరులో ఎంపీపై దాడి చేసిందెవరు? పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం చుట్టూ ముళ్లకంచెలు ఎవ­­రి ఆదేశాలతో వేశారు? నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం నిజం కాదా? దాడుల్లో గాయపడిన వారు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలా? టీడీపీ కార్యకార్తలా? తిరుపతి ఎంపీ చేతినుంచి నామినేషన్లు లాక్కు­­న్నది నిజం కాదా? వీటితోపాటు జరిగిన అనేక దౌర్జ­న్యాలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్షంపై తిట్ల దండకం అందుకుని తాను ప్రజాస్వామ్యవాదినని చెప్పుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని ప్ర­జలు, రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: రౌడీయిజం చేస్తున్న పోలీసుల పేర్లు డిజిటల్‌ బుక్‌లోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement