‘స్థానిక’ ఎన్నికల్లో పోలీసులే స్పాన్సర్డ్ గూండాయిజం చేస్తున్నారు
నామినేషన్ కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారు
2029లో ప్రభుత్వం మారుతుంది..
తప్పు చేసిన అధికారులు శిక్షల నుంచి తప్పించుకోలేరు
నో అబ్జెక్షన్, క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు
హైకోర్టు, ఎస్‌ఈసీ ఉత్తర్వులనూ లెక్కచేయడం లేదు
ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితులు కల్పించాలి
వైఎస్సార్‌సీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి రూరల్: రాష్ట్రంలో పోలీసులే గూండాయిజానికి స్పాన్సరర్లుగా వ్యవహరిస్తున్నారని, రౌడీయిజం చేయిస్తున్న పోలీసుల పేర్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకువచ్చిన డిజిటల్ బుక్‌లోకి చేరుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు.
ఆయన సోమవారం చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, పల్నాడు ఎస్పీ జగదీష్ అడహళ్లి, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కునుగుల్, కడప ఎస్పీ విశ్వనాథ్, ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ పేర్లు ఇప్పటికే డిజిటల్ బుక్‌లోకి చేరాయన్నారు.
డీఎస్పీలు బాలస్వామి రెడ్డి, జగదీష్ నాయక్, ఏఎస్పీలు రవిమనోహరాచారి, శ్రీనివాసులు నాయుడు పేర్లు కూడా ఉన్నాయన్నారు. వీరంతా స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 2029లో ప్రభుత్వం మారుతుందని, తప్పులు చేసిన అధికారులు శిక్షల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరో ఒకరిని సంతృప్తి పరిచేందుకు చట్టాన్ని పక్కనపెడితే అది వారి ఉద్యోగ భవిష్యత్తుకే ముప్పుగా మారుతుందని తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు..
ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు నో అబ్జెక్షన్, క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే సర్టిఫికెట్లు జారీ చేయాలన్న హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని, సర్టిఫికెట్ల జారీలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో 925 నో అబ్జెక్షన్, క్లియరెన్స్ సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నామినేషన్ల ప్రక్రియను అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
తమిళనాడు నుంచి గూండాలు, చిత్తూరు నుంచి రౌడీలు..
స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోకి తమిళనాడు నుంచి గూండాలు, చిత్తూరు నుంచి రౌడీలు వచ్చి తిష్టవేశారని చెవిరెడ్డి చెప్పారు. తమిళనాడులోని రాణిపేట, గుడియాతం, చెన్నై, వేలూరు, సేలం, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి కిరాయి గూండాలు మారణాయుధాలతో మాటు వేసినట్టు తమకు పక్కా సమాచారం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తే తలలు పగలగొడతామంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ నాయకులను బైండోవర్ చేయడం కాకుండా, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల్లో పక్షపాతానికి తావివ్వకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేస్తే వాటి పరిణామాలు మూడు తరాల వరకు వెంటాడతాయని హెచ్చరించారు. తప్పు చేసిన ప్రతి అధికారీ న్యాయదేవత ముందు దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: స్థానిక సంస్థల ఎన్నికల‍్లో అక్రమాలపై సుప్రీంకోర‍్టుకు వైఎస్సార్‌సీపీ


