వైఎస్సార్‌సీపీ దళిత మహిళా నేతపై బైండోవర్‌ కేసు | Case filed against Dalit woman leader from YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ దళిత మహిళా నేతపై బైండోవర్‌ కేసు

Oct 20 2026 3:51 AM | Updated on Oct 20 2026 3:51 AM

Case filed against Dalit woman leader from YSRCP

మున్సిపల్‌ ఎన్నికల కోసం వేధింపులు 

మనోవేదనకు గురైన బాధితురాలు లలిత 

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిపై కేసుల పర్వం

తుని: మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నేతలపై రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న పోలీసులు కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన ఆ పార్టీ దళిత మహిళా నేతపైనా బైండోవర్‌ కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న బాధితురాలు కోరిమిల్లి లలిత సోమవారం దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..  తుని కొండవారిపేటకు చెందిన నేను వైఎస్సార్‌సీపీలో మహిళా నేతగా చురుకైన పాత్ర పోషిస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో తుని పట్టణ పోలీసులు 41(ఏ) నోటీసు ఇచ్చి కేసులు పెట్టారు. ప్రస్తుతం మూడు కేసుల్లో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది.

 నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంలో  వైఎస్సార్‌సీపీ తరఫున పాల్గొంటుండడంతో టీడీపీ నేతలు అక్కసుతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి నాపై కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల వేళ నన్ను ప్రచారంలో పాల్గొనకుండా చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి మా ఇంటికి పోలీసులను పంపుతున్నారు. నేను వేరే ఊరిలో ఉన్నానని చెప్పినా పట్టించుకోవడంలేదు.

రోజుకు మూడుసార్లు పోలీసులు మా ఇంటికి వస్తుండటంతో నా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఊరి నుంచి వచ్చాక పోలీస్‌స్టేషన్‌కు రావాలని పిలవడంతో వెళ్లాను. తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి రూ.5 లక్షల బాండ్‌పై సంతకం చేయించుకుని బైండోవర్‌ కేసు నమోదు చేశారు. కేసు ఎందుకు పెట్టారని అడిగితే.. పాత కేసులు ఉన్నాయని, ఎన్నికల్లో గొడవలు జరగకూడదని బైండోవర్‌ చేశామని ఎస్‌ఐ చెప్పారు. దళితులకు కూటమి ప్రభుత్వంలో రక్షణలేదు. అక్రమ కేసులు పెట్టిన అధికారులపై చట్టపరంగా పోరాటం చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement