మీడియాతో మాట్లాడుతున్న ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠ, కృష్ణతేజ
రేపటి నుంచి నామినేషన్లు
659 జెడ్పీటీసీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 3న పోలింగ్.. 5న లెక్కింపు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో 663 మండలాలు ఉండగా.. 659 జెడ్పీటీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు మండల పరిషత్ కార్యాలయాల్లోను, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ కార్యాలయాల్లోను నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఈసీ తెలిపారు.

నామినేషన్ల ప్రక్రియలోనూ వెబ్‌కాస్టింగ్
కాగా.. రాజధాని అమరావతి ప్రాంతంలోని నాలుగు మండలాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల అధికారి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. అమరావతిలో ఉండే నాలుగు మండలాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు నామినేషన్లు స్వీకరించే 659 మండల కేంద్రాలు, 28 జిల్లా కేంద్రాల్లో పూర్తిగా వెబ్‌కాస్టింగ్ (వీడియో చిత్రీకరణ)కు ఏర్పాట్లు చేసినట్టు కృష్ణతేజ తెలిపారు.
వెబ్‌కాస్టింగ్ లైవ్ జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ, రాష్ట్ర స్థాయిలో పోలీస్, రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లకు అందుబాటులో ఉంటుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో ఎక్కడ వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లను పెట్టాలో కలెక్టర్ల స్థాయిలో నిర్ణయం తీసుకుంటారన్నారు. విశాఖ జిల్లాలో అత్యల్పంగా కేవలం నాలుగు జెడ్పీటీసీ మాత్రమే ఉండగా.. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 39 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం.



