సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే గ్రామాల్లో నవంబర్ 3న ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యాలయాలతోపాటు వ్యాపార, వాణిజ్య సంస్థలకు సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ఉండే కార్యాలయాలకు 2, 3 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలంటూ సీఎస్ ఆదేశించారు.
మద్యం షాపుల బంద్
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం షాపుల మూసివేతకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎస్ సాయిప్రసాద్ వేరే ఆదేశాల్లో పేర్కొన్నారు. నవంబర్ 3న పొలింగ్ ముగిసే ఐదు గంటల సమయానికి సరిగ్గా 48 గంటల ముందు నుంచి మద్యం షాపుల మూసివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


