ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సుల టెండర్‌ను రద్దు చేయాలి | APSRTC employees JAC demands cancellation of private tenders | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సుల టెండర్‌ను రద్దు చేయాలి

Oct 20 2026 3:38 AM | Updated on Oct 20 2026 3:38 AM

APSRTC employees JAC demands cancellation of private tenders

విద్యుత్‌ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలి

ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులు భర్తీ చేయాలి

మూసివేసిన నాలుగు డిపోలను వెంటనే తెరవాలి

ఆర్టీసీ జేఏసీ డిమాండ్‌

ఆర్టీసీ పరిరక్షణ కోసం 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

సాక్షి, అమరావతి: ఆర్టీసీ మనుగడకు, ఉద్యోగుల ఉపాధి, భద్రతకు ముప్పుగా మారే 1,450 ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సుల టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ పరిరక్షణకు ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ఉద్యోగు­లు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేయనున్నట్లు తెలిపారు. 

ఆర్టీసీ యాజమాన్యం గతంలో జేఏసీకి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఏకపక్షంగా ప్రైవేట్‌ విద్యుత్‌ బస్సుల కోసం టెండర్లు పిలవడం, జీసీసీ విధానంలో ప్రైవేట్‌ సంస్థలకు విద్యుత్‌ బస్సుల నిర్వహణ పేరుతో రాష్ట్రంలోని 29 డిపోలను అప్పగించేందుకు చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులకు తాము వ్యతిరేకం కాదని, అయితే వాటిని ప్రైవేటుకు కాకుండా ఆర్టీసీ కొనుగోలు చేసి సొంత సిబ్బందితో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించకుండా, 15వేల ఖాళీ పోస్టులను భర్తీ చేసి, మూసివేసిన నాలుగు డిపోలను పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించకుంటే ఈ నెల 26న విజయవాడలో జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement