నామినేషన్ల పరిశీలనలోనూ అరాచకాలు | YSRCP Submits Complaint to SEC Over Alleged Electoral Violations | Sakshi
Sakshi News home page

నామినేషన్ల పరిశీలనలోనూ అరాచకాలు

Oct 20 2026 5:58 AM | Updated on Oct 20 2026 5:58 AM

YSRCP Submits Complaint to SEC Over Alleged Electoral Violations

ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తున్న లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు

ఎస్‌ఈసీ పునేఠను కలిసి వినతిపత్రాలిచ్చిన వైఎస్సార్‌సీపీ 

నామినేషన్ల సమయంలో 22 చోట్ల జరిగిన అక్రమాలపై సాక్ష్యాధారాలతో మరోసారి ఫిర్యాదు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు పరిశీలనలో కూడా అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి పలుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామి­నేషన్లు తిరస్కరించేలా చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠను కలిసి వినతిపత్రం అందజేశారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పా­టు చేయాలని కోరినా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీ ఇప్పటికైనా మేల్కొని అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు.

ఈ మేరకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఎస్‌ఈసీకి వినతిపత్రంతో పాటు వీడియోలు, ఇతర సాక్ష్యాధారాలను అందజేశారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, వైఎస్‌ అవినాష్ రెడ్డిపై జరిగిన దాడుల దృశ్యాలను కూడా సమరి్పంచారు. పోలీసులు వ్యవహరించిన తీరుపైనా ఫిర్యాదు చేశారు. తిరుపతి మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ బీసీ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆయన నామినేషన్‌పై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

ఒత్తిళ్లతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించవద్దని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశారు.  నంద్యాల జిల్లా ఆత్మకూరు, కనిగిరి స్క్రూటినీ కేంద్రాల్లోనే నామినేషన్‌ పత్రాలు చించివేశారని తెలిపారు. ప్రొద్దుటూరు, కుప్పంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరి­గాయని చెప్పారు. కుప్పంలో తమ పార్టీ అభ్యర్థి విజయ్‌కుమార్‌ను కిడ్నాప్‌ చేశారని, ఆయన ఆచూకీ కనుగొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

దాడులు చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోకపోగా, కొన్ని చోట్ల పోలీసులే నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కున్నారని ఎస్‌ఈసీకి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో నామినేషన్ల అడ్డగింతలు, దాడులు జరిగాయని తెలిపారు. అక్రమాలు జరిగిన ఆ 22 ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియను తిరిగి నిర్వహించాలని, లేదా ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవడంతో పాటు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement