సాక్షి, విశాఖపట్నం: రాజకీయాలు మారవచ్చు, అధికారం చేయి మారవచ్చు..కానీ మనసు మారదు. పేద కార్మికుని కన్నీటి ముందు ఆర్థ్రతగా కరిగే మనసుకు అధికారం అక్కరలేదు. వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి అది నిరూపించారు. స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. 1600 డిగ్రీల మరుగుతున్న ఉక్కు ప్రవాహంలో తొమ్మిది మంది కార్మికులు దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
ఆ వేదన విన్న మరుక్షణమే జగన్ మనసు అటు పరిగెత్తింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. అంతటితో ఆగిపోలేదు..బుధవారం స్వయంగా విశాఖ వచ్చారు. సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ప్రతిపక్షంలోనూ అదే సంస్కారం
అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పరిగెత్తడం అందరికీ తెలుసు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బాధితుల వద్దకు వెళ్లే నాయకులు చాలా అరుదు. జగన్ ఆ అరుదైన వారిలో ఒకరు. స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఎక్కువమంది సాధారణ కారి్మకులే. భారతీయ ఉక్కు సంస్థకు కాంట్రాక్ట్ కింద పనిచేసే వారు. వారి కుటుంబాలకు తక్షణ పరిహారం అందాలని, న్యాయం జరిగేంత వరకూ బాధితుల తరఫున పోరాడతామన్నారు. ఆత్మీయంగా మాట్లాడుతూ కొండంత భరోసా కల్పించారు. నేనున్నానంటూ కన్నీళ్లు తుడిచారు.


