
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న పార్టీ నేతలు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
ఘనంగా నివాళులు.. అభిమానుల రక్తదానం
ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడిన నేతలు
వైఎస్సార్ రాజ్యం కోసం వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపు
సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సేవలు దేశంలోనే ట్రెండ్‌ను సెట్ చేశాయని, అందుకే ‘పేదల గుండెచప్పుడు వైఎస్సార్’ అని అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నేతలు అంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొనియాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహానేత జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రులు జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హనుమంతరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి వారు భారీ కేకును కట్ చేశారు. తర్వాత పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వైఎస్సార్ దూరమయ్యి 15 ఏళ్లు గడిచినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికీ ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి కార్యక్రమాల ద్వారా రైతులను రాజుగా నిలబెట్టారని చెప్పారు. పేదవాడికి ఉచితంగా విద్య, వైద్యం అందించేందుకు ఆయన తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయన్నారు.
ప్రతి మనిషినీ సంతోషంగా నవ్వుతూ పలకరించడం వైఎస్సార్ నుంచే నేర్చుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడని, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన విజనరీ అని కొనియాడారు. మళ్లీ వైఎస్సార్ రాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు.
జయంతినాడే వైఎస్సార్ విగ్రహం తొలగింపు
అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీ అధికారులు దారుణ ఘాతుకానికి తెగబడ్డారు. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. కూటమి నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్ జయంతి రోజునే ఉద్యోగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ స్థానికులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు మండిపడ్డారు. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే యథాస్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తదుపరి పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.