దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం : వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Attempted Case Against Dalit Nursing Student, Assures Legal Support And Promises Justice For Family | Sakshi
Sakshi News home page

దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం : వైఎస్‌ జగన్‌

Apr 7 2026 5:13 PM | Updated on Apr 7 2026 5:22 PM

YS Jagan Slams Attempted Case Against Dalit Student

సాక్షి, అమరావతి: దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులకు గురైన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించినందుకు పామర్రు సీఐ శుభాకర్‌, ఎస్సై భాస్కర్‌ స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తిరిగి తనపై కేసులు నమోదు చేశారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ,ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

కూటమి ప్రభుత్వంలో తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాలను సుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం దారుణమని జగన్ మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ కైలే అనిల్‌కుమార్‌కు సూచించారు.

పామర్రు సీఐ శుభాకర్‌, ఎస్సై భాస్కర్‌లపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూడాలని జగన్ అన్నారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో సుప్రియ,ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement