హెల్దీ బాడీతో తల్లీ బిడ్డల వికాసం 

YS Jagan Mohan Reddy Started Nutrition Food Scheme For Children - Sakshi

అందుకే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ.. పోషణ ప్లస్‌ పథకాలు

ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లేదు 

తల్లి, పిల్లల్లో పౌష్టికాహార లోపం   

పరిష్కారంగా మంచి పౌష్టికాహారం, విద్య, మనో వికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు 

తల్లులకు పోషణ, పిల్లలకు సంరక్షణ, చదువుల్లో ఒక విప్లవం  

30.16 లక్షల మంది చెల్లెమ్మలు, చిన్న పిల్లలకు లబ్ధి 

చెల్లెమ్మలకు అన్నగా, పిల్లలకు మామగా ఏటా రూ.1,863.11 కోట్లతో ఈ కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: ‘హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్‌.. అప్పుడే తల్లీ బిడ్డల్లో వికాసం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేటి తరంలో చాలా మంది పిల్లలు, తల్లుల్లో పౌష్టికాహార లోపం కనిపిస్తోందని, వారందరిలో మార్పు తీసుకురావడానికే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను తీసుకువచ్చామని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులు చేస్తూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అత్యంత మెరుగైన పౌష్టికాహారం అందించే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, 77 గిరిజన మండలాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గతంలో చాలీచాలని నిధులు 
► గతంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేరా? పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? వారి తల్లులు ఎలా ఉన్నారు? అనే వాటి గురించి ఎవరూ ఆలోచించలేదు.  
► గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం చాలీ చాలని నిధులు ఇచ్చేవారు. ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లు ఉండేది.   
► నేటి తరంలో మంచి ఆహారం లభించని పిల్లలు, తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అందుకే 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల వరకు, బిడ్డకు జన్మనివ్వనున్న తల్లులు, బాలింతలకు వర్తించేలా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలు అమలు చేస్తున్నాం.  
► రాష్ట్రంలోని గర్భవత్లులో దాదాపు 53 శాతం మందిలో రక్తహీనత ఉంది. 31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు ఆ పరిస్థితిలోనే పెరుగుతున్నారు. 
► 5 ఏళ్లలోపు పిల్లల్లో 17.2 శాతం మంది బరువుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారున్నారు. వయసుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారు 32 శాతం మంది ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. 
  
మార్పు దిశగా అడుగులు  
► రాష్ట్ర వ్యాప్తంగా నాడు–నేడు ద్వారా 55,607 అంగన్‌వాడీల రూపురేఖలు మార్చబోతున్నాం. వాటిని ప్రిప్రైమరీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నాం. పీపీ–1, పీపీ–2 మొదలు పెడుతున్నాం. ఆట పాటల ద్వారా, మాటల ద్వారా ఇంగ్లిష్‌ మీడియంకు గట్టి పునాది వేస్తున్నాం. తద్వారా దాదాపు 30.16 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, చిన్న పిల్లలకు లబ్ధి కలుగుతుంది.  
► రాష్ట్రంలో 47,287 అంగన్‌వాడీ కేంద్రాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి పరిధిలో 26.36 లక్షల మంది తల్లులు, పిల్లలకు దాదాపు రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.  
► 77 గిరిజన మండాలాల్లోని 8,320 అంగన్‌వాడీల పరిధిలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ చేపట్టాం. 3.8 లక్షల మంది పిల్లలు, తల్లులకు మేలు జరుగుతుంది. ఇందుకు రూ.307.55 కోట్లు ఖర్చవుతుంది. మొత్తంగా ఏటా రూ.1,863.11 కోట్లు ఈ కార్యక్రమాల కోసం వ్యయం చేస్తున్నాం. 
► ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, ఎం.శంకర నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఆ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పలువురు అధికారులు, పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఆహారం అందకపోవడమే కరువు
ఆహార కొరత వల్ల కరువు ఏర్పడదు. ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల కరువు ఏర్పడుతుంది. పేదలు, అట్టడుగు వర్గాల వారికి సామాజిక, ఆర్థిక, పాలనా పరమైన కారణాల వల్ల ఆహారం అందించడానికి ఆటంకం కలుగుతుంది. రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిలో సరిగా పని చేయని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వాల తీరు ఇందుకు కారణం కావచ్చు. – అమర్త్యసేన్, ప్రఖ్యాత ఆర్థిక వేత్త 

ఈ పరిస్థితి మార్చబోతున్నాం
పిల్లలు, తల్లులు, వారి మెదడు, ఆలోచనా సరళిపై పౌష్టికాహార లోపం కనిపిస్తుంది. తద్వారా పిల్లల చదువు, మేధస్సు, దేహం మీద ప్రభావం ఉంటుంది. హెల్దీ బాడీ అండ్‌ హెల్దీ మైండ్‌ కాన్సెప్ట్‌తో ఈ పరిస్థితిని మార్చబోతున్నాం. ఈ రెండూ కూడా ఇంటర్‌ రిలేటెడ్‌. హెల్దీ బాడీ ఉంటేనే హెల్దీ మైండ్‌ ఉంటుంది. –సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top