
జరగని లిక్కర్ స్కామ్‌ను జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు
ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం
సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
అబద్ధపు వాంగ్మూలాలతో మిథున్‌ను అక్రమంగా ఇరికించారు
తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు.. ఇదంతా ఆయనపై నమోదైన మద్యం స్కామ్ కేసును రద్దు చేసుకునేందుకే..
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకోవడానికే..
2014–19 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికే..
మళ్లీ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలు
మద్యం దుకాణాల లైసెన్స్‌లలో అవినీతి, అంతటా మాఫియా
ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కడానికి చేసిన కుట్ర
అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై నేర పూరిత దాడే
పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా ప్రజలతోనే వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లు చిత్రీకరిస్తూ.. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం చంద్రబాబు రాష్ట్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
2014–19 మధ్య జరిగిన అనేక కుంభకోణాల్లో.. తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఆ కేసుల్లో ఆయనతో పాటు ఆయన సన్నిహితులపై దర్యాప్తు నిలిపేయించుకున్న చంద్రబాబు.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్యం అంశానికి సంబంధించి వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను జత చేస్తూ ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారనేది తిరుగులేని సాక్ష్యం
‘వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అక్రమ కేసు. ప్రజల తరఫున పోరాడేవారి గొంతు నొక్కేయడానికి రూపొందించిన కుట్ర తప్ప మరొకటి కాదు. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బెదిరించి బలవంతంగా సేకరించిన అబద్ధపు వాంగ్మూలాలతో కేసులో అక్రమంగా ఇరికించారు.
టీడీపీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. జరగని మద్యం స్కామ్‌ను జరిగినట్లుగా చిత్రీకరించడం కేవలం మీడియా నాటకాల కోసం.. నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సృష్టించిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదు. ఈ కుంభకోణం మొత్తం కేసు ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్–డిగ్రీ హింస, లంచాలు, ప్రలోభాలాల ద్వారా సేకరించిన తప్పుడు వాంగ్మూలాలపై సృష్టించిందే.
2014–19 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి అక్రమాలపై కేసులో చంద్రబాబు స్వయంగా బెయిల్‌పై ఉన్నాడనే వాస్తవం.. ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడనేదానికి తిరుగులేని సాక్ష్యం. 2014–19 మధ్య కాలంలో ఆయనపై నమోదైన మద్యం కుంభకోణం కేసును రద్దు చేసుకోవడానికి.. ఇప్పుడు 2024–29 మద్యం విధానాన్ని సమర్థించుకోవడానికి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారన్నది వాస్తవం.
ఇలాంటి కుట్రలను ధైర్యంగా ఎదుర్కొన్నాం
వైఎస్సార్‌సీపీని అణచి వేయడానికి ఇలాంటి కుట్రలు జరిగిన ప్రతిసారి మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం. ప్రజలతో నిలబడి వారి పక్షాన ప్రశ్నిచడం, పోరాడటం ద్వారా మేము ఎదిగాము. అన్యాయాలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రజల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది. పైన వివరించిన విధంగా టీడీపీ అధికార దుర్వినియోగం ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడి కంటే తక్కువ కాదు. పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, వైఎస్సార్‌సీపీ ప్రజలతో నిలుస్తుందని, వారి గొంతుకగా, కవచంగా ఉంటుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. మద్యం అంశానికి సంబంధించి సమగ్ర నివేదికను మీ పరిశీలన కోసం జత చేస్తున్నాను.’
గత ప్రభుత్వ విజయాలు అపహాస్యం
మద్యం కుంభకోణం విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే.. ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్ వైఎస్సార్‌సీపీ రద్దు చేసిన మద్యం అవినీతి పద్ధతులను పునరుద్ధరిస్తోంది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల పేరుతో మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయి.
వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లను మూసి వేయడం, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తుత కూటమి సర్కార్ అపహాస్యం చేస్తూ మళ్లీ పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ షాపులు, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. మద్యం నియంత్రణను బలహీన పరుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లలో మళ్లీ అవినీతి, మాఫియా ప్రవేశించాయి. ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఆర్డర్‌లు ఇవ్వడం ద్వారా 2019లో మేము అమలులోకి తెచ్చిన పారదర్శక ప్రభుత్వ దుకాణాల వ్యవస్థను రద్దు చేసింది.
ఇది రాజకీయ ప్రేరేపిత కేసు
చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు రాష్ట్ర సంస్థలను, ఎల్లో మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. అనేక తీవ్రమైన అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయన బెయిల్‌పై ఉన్న కేసుల్లో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మధ్యం కుంభకోణం కూడా ఉంది.
అప్పట్లో మద్యం సిండికేటు మాఫియాను పెంచి పోషించి అవినీతిని వ్యవస్థీకరించారు. అధికారంలోకి వచ్చాక, చంద్రబాబునాయుడు తనపై, తన సన్నిహితులపై ఉన్న ఆ తీవ్రమైన అవినీతి కేసుల దర్యాప్తును నిలిపి వేశారు. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ప్రేరేపితమైన మద్యం కేసును రూపొందించడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు.
ప్రజల హృదయాల్లో పాతుకుపోతున్నారని..
టీడీపీ నిజమైన ఎజెండా ఇప్పుడు స్పష్టంగా ఉంది. దర్యాప్తు ముసుగులో వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి చట్టపరమైన ప్రక్రియను లాగడానికి వారు సిట్‌ను ఉపయోగించాలనుకుంటున్నారు. కానీ.. విచారణ ప్రారంభమైన తర్వాత అసలు నిజం బయట పడుతుంది.
ఇది పూర్తిగా చట్టపరమైన అర్హత లేని నిరాధారమైన, రాజకీయంగా ప్రేరేపితమైన కేసు. వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేస్తున్నది వారు దోషులు కాబట్టి కాదు.. ప్రజల హృదయాల్లో లోతుగా పాతుకుపోతున్నారు కాబట్టి. ఇది చట్టపరమైన ప్రక్రియ కాదు. ఇది బలమైన ప్రతిపక్షాన్ని అస్థిర పరచడానికి ఉద్దేశించి సాగిస్తున్న రాజకీయ వేట.