తాడేపల్లి: ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతిపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యుడిగా డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ అందించిన విశేష సేవలను గుర్తుచేసుకున్నారు.
పోలియో రోగులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారన్నారు. పోలియో బాధితులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత శస్త్రచికిత్సలు చేశారని, దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.
డాక్టర్ ఆదినారాయణరావు పోలియో రహిత భారతదేశం కోసం ఎన్నో కలలు కన్నారని, అలాంటి గొప్ప వైద్యుడి మరణం తీరని లోటని అభివర్ణించారు. డాక్టర్ ఆదినారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొన్నారు.


