ప్రజల వద్దకు వెళ్లకుండా.. జగన్‌ను అడ్డుకునే కుట్రే! | YS Jagan Bulletproof car Seized: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రజల వద్దకు వెళ్లకుండా.. జగన్‌ను అడ్డుకునే కుట్రే!

Jun 25 2025 4:41 AM | Updated on Jun 25 2025 8:46 AM

YS Jagan Bulletproof car Seized: Andhra pradesh

పోలీసులు స్వాధీనం చేసుకున్న వైఎస్‌ జగన్‌ కారు

మాజీ సీఎం బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం అక్రమ జప్తు

వైఎస్‌ జగన్‌ భద్రతపై కూటమి సర్కారు మరో కుతంత్రం

ఉద్దేశపూర్వకంగా డొక్కు వాహనాన్ని సమకూర్చిన ప్రభుత్వం

న్యాయస్థానం అనుమతితో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కొనుగోలు చేసిన వైఎస్సార్‌సీపీ

ఆ వాహనాన్నీ జప్తు చేసిన బాబు సర్కారు

సాక్షి, అమరావతి: విశేష ప్రజాదరణతో సాగుతున్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు కుతంత్రాలను కొనసాగి­స్తోంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటిక­ప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం రలిగిస్తున్న వైఎస్‌ జగన్‌ను అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా బరి తెగించి వ్యవహరిస్తోంది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం జగన్‌ భద్రతా ఏర్పాట్ల పట్ల కుట్రపూరిత వైఖరిని అవలంబిస్తోంది. వైఎస్‌ జగన్‌కు చెందిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ఏకపక్షంగా జప్తు చేయడం చంద్రబాబు సర్కారు పన్నాగంలో తాజా అంకం. తద్వారా వైఎస్‌ జగన్‌ భద్రతపై ఉద్దేశపూర్వకంగా ఏడాదిగా సాగిస్తున్న కుట్రలకు మరింత పదును­పెట్టింది. పాలనలో తన ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెర తీసిన తాజా పన్నాగం ఇదిగో ఇలా ఉంది...

అక్రమ కేసు... ఏకపక్షంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సీజ్‌
ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఉదంతాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి సర్కారు కుట్రలను కొనసాగిస్తోంది. ఆ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి ఓ వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. అధికారిక కాన్వాయ్‌లో లేని ఓ ప్రైవేట్‌ వాహనం (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) ఢీకొనడంతో సింగయ్య మృతి చెందినట్లు తమ విచారణలో వెల్లడైందని స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌ అధికారికంగా  ప్రకటించారు. ఆ వాహనాన్ని పోలీసులు జప్తు చేసి పోలీస్‌ స్టేషన్‌కు కూడా తరలించారు. కానీ ఆ ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసు నమోదుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎస్పీ సతీశ్‌ మూడు రోజుల్లోనే మాట మార్చాల్సి వచ్చింది.

వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఓ కథను తెరపైకి తెచ్చి అక్రమ కేసు నమోదు చేశారు. మూడు రోజుల్లోనే మాట మార్చి అక్రమ కేసు నమోదు చేయ­డం వెనుక కుట్ర కోణం తాజాగా బయటపడింది. వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని గుంటూరు పోలీసులు మంగళవారం జప్తు చేసి తరలించుకుపోవడంతో ప్రభుత్వ పన్నాగం స్పష్టమైంది. అంటే వైఎస్‌ జగన్‌ ప్రయాణించేందుకు పటిష్ట భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం అందు­బాటులో లేకుండా చేయడమే లక్ష్యమన్నది తేటతెల్ల­మైంది. ఎందుకంటే ఇదే కేసులో ఇప్పటికే ఓ ప్రైవేటు వాహనాన్ని (ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ) పోలీసులు జప్తు చేశారు. అదే కేసులో మళ్లీ వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తాజాగా జప్తు చేయడం గమనార్హం. తద్వారా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం 
అందుబాటులో లేకుండా చేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యమన్నది స్పష్టమైంది. 

జగన్‌ భద్రతపై బాబు కుట్రలు..
వైఎస్‌ జగన్‌ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుట్ర. అందుకోసం ఏడాదిగా కుతంత్రాలు పన్నుతూనే ఉంది. ఏడాదిగా వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లపై ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మాజీ సీఎంహోదాలో ఆయన పర్యటనలకు పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమ­కూ­ర్చాలి. కానీ పాతబడిన ఓ డొక్కు వాహనాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ వాహనం మొరాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఓ పర్యట­నలో ప్రభుత్వం సమకూర్చిన డొక్కు వాహనం నుంచి దిగి మరో ప్రైవేటు వాహనంలో వైఎస్‌ జగన్‌ పర్యటించారు.

బుల్లెట్‌ ప్రూఫ్‌ కాని వాహనంలో ఆయన ప్రయా­ణించాల్సి రావడంతో వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆందోళ చెందారు. ఎందుకంటే వైఎస్‌ జగన్‌ పర్య­టనలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ గూండాలు ఎటువంటి దుస్సాహసానికైనా తెగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు అనుమతితో పార్టీనే ఓ కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఆ వాహనంలోనే ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని ఆయనకు అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసి వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని జప్తు చేసింది. 

ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకునే కుట్రే...
వైఎస్‌ జగన్‌ పట్ల వెల్లువెత్తుతున్న విశేష ప్రజాదరణను తట్టుకోలేకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుతంత్రాలు పన్నుతోంది. ఆయన ఎంత విస్తృతంగా పర్యటిస్తే... తమ ప్రభుత్వ వైఫల్యాలు అంతగా వెలుగులోకి వస్తాయన్నది టీడీపీ పెద్దల భయం! జగన్‌ పర్యట­నలకు దారి పొడవునా వేలాది మంది జనం తరలి వస్తుండటం ప్రభుత్వ పెద్దలను కలవరపరుస్తోంది. ఆ అక్కసుతోనే వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం  చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల మీడియా చానెళ్ల ఇంట­ర్వ్యూల్లో ప్రకటించడం గమనార్హం. మరోవైపు వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో ఉద్దేశపూర్వకంగా భద్రతా ఏర్పాట్లలో వైఫల్యాలను గమనిస్తుంటే చంద్రబాబు తన వ్యాఖ్యలను చేతల్లో చూపిస్తున్నారన్నది స్పష్ట­మవుతోంది. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని అక్రమంగా జప్తు చేశారు. కేసు దర్యాప్తు పేరిట ఆ వాహనాన్ని సుదీర్ఘ కాలం జప్తులో ఉంచాలన్నది పన్నాగం.

మరోవైపు టీడీపీ ప్రభుత్వం ఎలాగూ పూర్తి కండిషన్‌లో ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చదు. తద్వారా వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలను అడ్డుకోవాలన్నదే ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్ర­బాబు సర్కారు కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోంది. వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది. సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ నమోదు చేసిన అక్రమ కేసుపైనా న్యాయ పోరాటం చేయనుంది. వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల ప్రభుత్వ కుతంత్రాలపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తు­న్నారు. రాజకీయాలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రికి పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. 40 ఏళ్ల సీని­య­ర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు పూర్తి దిగ­జారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

బయటపడిన భద్రతా వైఫల్యాలు
జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల ప్రభుత్వం కుట్రపూరిత వైఖరి ప్రదర్శిస్తోంది. ఆయన జిల్లాల పర్యట­నలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. జిల్లా పర్యటనలపై ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చినా సరే కనీస స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. గతంలో అనంతపురం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటనల్లో అడుగడు­గునా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ తీరు ఏమాత్రం మారడం లేదు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యట­నలోనూ భద్రతా వైఫల్యం బయటపడింది.  వైఎస్‌ జగన్‌ వాహనం ముందు ఎస్కార్టు వాహ­నాలు ఏర్పాటు చేయలేదు.  ఆయన వాహనానికి ఇరువై­పులా  రోప్‌ పార్టీ పోలీ­సులు లేరు. దాంతో వైఎస్సార్‌సీపీ అభిమానులే కాదు... ఆ ముసు­గులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు వైఎస్‌ జగన్‌ వాహనంపైకి చొచ్చు­కొచ్చారు.

ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్‌చల్‌ చేశాడు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న ఓ మాజీ సీఎం వాహనం బానెట్‌పైకి యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోక­పోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీ­యంగా జరిగింది కాదు.. పోలీసులు ఉద్దేశపూర్వ­కంగానే వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. జగన్‌ జిల్లాల పర్యటన­లకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యే హెలీప్యాడ్‌ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమా­నులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలి­కాఫ్టర్‌ వద్దకు చొచ్చుకుని వచ్చేం­దుకు అవ­కాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురం పర్య­ట­నలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య ఎదురైంది. దాంతో జగన్‌ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు హెలి­కాఫ్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement