అనంతపురం జిల్లా రాప్తాడులో తరలివచ్చిన అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుని కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న వైఎస్ జగన్
అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టిన అశేష జనసందోహం
ఎదురేగి స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులు
అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్
రాప్తాడు/రాప్తాడు రూరల్: ఉప్పొంగిన అభిమాన జన సంద్రంతో రాప్తాడు ప్రాంతం కిక్కిరిసిపోయింది. జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమాన నేతను చూసేందుకు.. చేయి కలిపేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె డాక్టర్ మోక్షితా విష్ణుప్రియారెడ్డి, డాక్టర్ తేజేష్‌రెడ్డి వివాహ వేడుక ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

వివాహ వేడుకలో పాల్గొని, నవ దంపతులను ఆశీర్వదిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
హెలిప్యాడ్ నుంచి వైఎస్ జగన్ కారులో ప్రయాణిస్తున్న మార్గంలో అశేష జనసందోహంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో అడుగులు వేశారు. వివాహ వేదిక వద్దకు చేరుకోగానే ఈలలు, జై జగన్ నినాదాలు చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. వైఎస్ జగన్ అందరికీ అభివాదం చేస్తూ.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన వధూవరులు డాక్టర్ మోక్షితా విష్ణుప్రియారెడ్డి, డాక్టర్ తేజేష్‌రెడ్డికి వైఎస్ జగన్ వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీస్సులు అందజేశారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో వైఎస్ జగన్ ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు.

]



